ట్రంప్ పై పోరాటానికి ట్విట్టర్ డొనేషన్..

Posted February 4, 2017

twitter donated to money american civil liberties union against trumpఏడు ముస్లిం దేశాల నుంచి అమెరికా రాకుండా ఆ దేశ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం మీద ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసేందుకు అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే.ఆ సంస్థకి ఆర్ధిక సాయం చేసేందుకు బడాబడా కంపెనీలు సై అంటున్నాయి. ట్విట్టర్ సీఈఓ జాక్ డార్సీ సహా ఆ కంపెనీకి చెందిన వెయ్యి మంది ఉద్యోగులు కలిసి 15 లక్షల డాలర్లు డొనేట్ చేశారు.ఈ కొద్ది రోజుల్లోనే అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కి 24 మిలియన్ డాలర్లు చందాగా వచ్చాయి.ట్రంప్ నిర్ణయం మీద అమెరికాలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు ఇది ఓ చిన్న ఉదాహరణ.

ట్విట్టర్ తో పాటు మైక్రోసాఫ్ట్,గూగుల్,ఆపిల్,నెట్ ఫ్లిక్స్,టెస్లా,పేస్ బుక్,ఉబెర్ లాంటి సంస్థలన్నీ ట్రంప్ నిర్ణయం మీద మండిపడుతున్నాయి.ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నందుకు రాబోయే రోజుల్లో కొన్ని ఇబ్బందులు తప్పవని తెలిసి కూడా ఈ సంస్థలు ముందడుగు వేస్తున్నాయి.ప్రభుత్వ పరంగా వచ్చే ఇబ్బందులకు భయపడి మానవ హక్కులకు భంగం కలుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని ట్విట్టర్ ఉన్నతోద్యోగులు కుండ బద్దలు కొడుతున్నారు.అమెరికా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ట్రంప్ చెప్పడాన్ని ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్ తప్పుబట్టారు.భద్రత ముఖ్యమే అయినప్పటికీ …దానికి ముప్పు తెస్తున్నవారి మీద దృష్టి పెట్టాల్సింది పోయి అందర్నీ ఒకే గాటన కట్టడం మంచిదికాదని జుకర్ బర్గ్ అన్నారు.కార్పొరేట్ సంస్థలన్నీ ట్రంప్ కి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావడంతో అమెరికా ఆర్ధిక వ్యవస్థ మీద దాని ప్రభావం తీవ్రంగా వుండే అవకాశం వుంది.