కేసీఆర్ కి రైతులపై హఠాత్తుగా ప్రేమెందుకో..?

0
84

Posted April 27, 2017 at 10:00

why kcr showing concern towards farmersమిషన్ 2019 టార్గెట్ పెట్టుకున్న కేసీఆర్.. ఇప్పట్నుంచే వరుస హామీలతో రైతుల్ని బుట్టలో వేస్తున్నారు. ఇప్పటివరకూ టీహబ్, ఐపాస్, అంటూ హడావిడి చేసినా పెద్దగా ప్రయోజనం దక్కలేదని గ్రహించిన గులాబీ బాస్ వ్యూహం మార్చారు. తెలంగాణలో ఎక్కువమంది ఆధారపడి బతికే వ్యవసాయ రంగంపై ఫోకస్ పెట్టారు. వరుసగా ప్లీనరీ, తర్వాత రైతుహిత పేరుతో వ్యవసాయ శాఖ సమీక్షలో కూడా అన్నదాతల గురించి ఎక్కువగా ప్రస్తావించారు. రుణమాఫీ, ఉచిత ఎరువుల పథకాలతో హోరెత్తించారు.

చివరకు ఢిల్లీ వెళ్లినా కూడా నీతి అయోగ్ మీటింగ్ లో రైతు ప్రధానంగా చర్చ జరిగేలా చూడటంలో కేసీఆర్ సక్సెసయ్యారు. రైతు ప్రధానంగా చర్చ జరగడానికి ఆయన కారణం అయినా, కాకపోయినా తెలంగాణలో మాత్రం ఈ విధంగా ప్రమోట్ చేసుకోవడంలో గులాబీ నేతలు విజయవంతం అయ్యారు. మూడేళ్లుగా ఐటీ కంపెనీల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కోసం ఎంత కష్టపడ్డా రాని పేరు.. ఒక్కసారిగా ఉచిత ఎరువుల పథకంతో కొట్టేశామని టీఆర్ఎస్ ఢంకా బజాయిస్తోంది. ఈ దెబ్బతో ముందస్తు ఎన్నికలు వచ్చినా గెలుపు తమదేనని ధీమాగా ఉంది.

ఇప్పటిదాకా కాస్తో, కూస్తో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత, ఈ దెబ్బతో సోదిలో లేకుండా పోయిందనేది గులాబీ వర్గాల వాదన. ప్రత్యర్థులకు ఊహకు అందని ఎత్తులు వేయడం, వారు తేరుకునే లోపే చిత్తు చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఉద్యమం సమయంలో అనూహ్య వ్యూహాలతో అందర్నీ వణికించిన కేసీఆర్.. ఇప్పుడు కూడా ఎన్నికల ముందు దూకుడు పెంచి ప్రతిపక్షాలు గుక్క తిప్పుకోకుండా చేస్తున్నారు. ఇక వరంగల్ సభలో కేసీఆర్ ఇంకేం కొత్త హామీలిస్తారోనని విపక్షాలు తెగ టెన్షన్ పడుతున్నాయి.