ఏపీలో వైసీపీ కార్యాలయం ఎక్కడంటే?

Posted February 17, 2017

ysr congress party office at tadepalli in amravati
పక్క రాష్ట్రంలో వున్న పార్టీ ..ఇక్కడ ప్రజల కోసం ఏమి పనిచేస్తుందని వైసీపీ టార్గెట్ గా ఏపీ అధికార పక్ష నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తూనే వున్నారు.దాదాపు రెండున్నరేళ్ల పాటు ఈ విమర్శల్ని పెద్దగా పట్టించుకోని వైసీపీ …దాని వల్ల జరుగుతున్న నష్టాన్ని గుర్తించింది.ఆ పార్టీ నేతలు, సానుభూతిపరులు కూడా ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లారు.గతంలో అమరావతి లో ప్రభుత్వం తమకు కేటాయించిన స్థలం కార్యాలయ భవనానికి సరిపోదని భావించిన జగన్ దానిపై బాబు సర్కార్ ని తూర్పారబట్టారు.మన ప్రభుత్వం వచ్చాక అదిరిపోయే బిల్డింగ్ కట్టుకుందామని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. కానీ వస్తున్న విమర్శలు,సూచనల్ని దృష్టిలో ఉంచుకుని జగన్ మనసు మార్చుకున్నారు.వైసీపీ ఆంధ్రప్రదేశ్ కార్యాలయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

వైసీపీ రాష్ట్ర కార్యాలయం రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలో కొలువుదీరబోతోంది. స్థానిక బై పాస్ రోడ్ లోని పాత టోల్ గేట్ సమీపంలో 2 ఎకరాల స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. అందుకు సంబంధించిన లావాదేవీలు ఇప్పటికే పూర్తి అయ్యాయి.వచ్చే నెలలో వైసీపీ కార్యాలయానికి శంఖుస్థాపన జరగనుంది.మార్చి లో శంఖుస్థాపన నాటి నుంచి 6 నెలల వ్యవధిలో కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.అన్ని అనుకున్నట్టు అయితే ఈ ఏడాది దసరాకి వైసీపీ కొత్తకార్యాలంలోకి జగన్ అడుగుపెట్టే అవకాశముంది.