అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారశైలి చూస్తే.. పిచ్చి ముదిరింది.. అన్నట్లుగా ఉంది. ఇప్పటికే వీసాలపై కఠిన నిబంధనలతో ఆడుకుంటున్న ట్రంప్.. తాజా నిర్ణయంతో అమెరికా అనే పేరు చెబితేనే కలలో కూడా ఉలిక్కిపడేలా చేస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లు, ఈ మెయిల్ అడ్రెస్ లు, ఫోన్ నంబర్లతో పాటు గత పదిహేనేళ్ల గత చరిత్రను తవ్వి చూశాకే వీసా ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.
తీవ్రవాద దాడుల్ని నిరోధించడానికి ఇంత కార్యక్రమం పెట్టామని అమెరికా సమర్థించుకుంటున్నా విమర్శలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా అకౌంట్లు చూస్తేనే అసలు విషయం బయటపడుతుందని అమెరికా అనుకుంటోంది. అదే జరిగితే పర్సనల్ లైఫ్ మొత్తం పబ్లిక్ అవుతుందని వీసా ఆశావహులు తల పట్టుకుంటున్నారు. అమెరికా వెళ్లకపోయినా నష్టం లేదని మరికొందరు అనుకుంటున్నారు.
ఈ అకౌంట్లన్నీ చూడాలి కాబట్టి.. వీసా ఇంటర్వ్యూ టైమ్ ఒక్కో అభ్యర్థికి గంటకు పెరగనుంది. అంటే 65వేల మందికి 65వేల గంటలు వెచ్చించాల్సిందే. నూతన నిబంధనలు తలకు మించిన భారమే కాకుండా.. విద్యార్థులకు కూడా వీసా జారీ కష్టమౌతోందని, అప్పుడు విలువైన విద్యాసంవత్సరం కోల్పోతే బాధ్యత ఎవరిదని అమెరికా వర్సిటీలు తలపట్టుకుంటున్నాయి.