ఆంధ్రాలో రెండు పారిశ్రామిక కారిడార్లు

  2 industrial corridors ap

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్త పరిశ్రమలపై దృష్టి సారించారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు వౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు అంశానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఫలితంగా, రెండు పారిశ్రామిక కారిడార్లు రానున్నాయి. పరిశ్రమ స్థాపనకు, కేవలం 21 రోజుల్లోనే ఆన్‌లైన్‌లో పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టడం కూడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మారింది. పారిశ్రామిక ప్రోత్సాహకాలను కూడా ఆన్‌లైన్‌లోనే మంజూరు చేసే వ్యవస్థను అభివృద్ధి చేయడాన్ని ప్రపంచ బ్యాంకు కూడా ప్రశంసించింది.

పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తేనే వారు ఆకర్షితులవుతారన్న విషయం గ్రహించిన బాబు.. ఆ మేరకు అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పరిశ్రమల శాఖకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్టియల్ పాలసీ అండ్ ప్రమోషన్ పనితీరును ప్రపంచ బ్యాంకు, కేంద్రం మెచ్చుకోగా, ఈ విధానానికి దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఏపికి రెండవ ర్యాంకు ఇవ్వడం గమనార్హం. ఏపి కేంద్రంగా రెండు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటుకానుండటం పరిశ్రమల స్థాపనకు అనుకూలించే అంశం కానుంది. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కానున్నాయి. వీటిలో విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ (విసిఐసి)కి 625 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అంగీకరించింది. 2019 నాటికి తొలిదశ ప్రాజెక్టు పూర్తవుతుందని భావిస్తున్నారు.

అప్పటికి మొత్తం రుణంలో 50 శాతం బ్యాంకు విడుదల చేస్తుంది. ప్రాజెక్టు వ్యయం 840 మిలియన్ డాలర్లవగా, ఏపి ప్రభుత్వానికి 30 శాతం వాటా లభిస్తుంది. కాగా, సీఎం చంద్రబాబు ఇటీవల నిర్వహించిన రష్యా, అంతకుముందు నాటి చైనా, దావోస్‌లలో పెట్టుబడుల కోసం చేసిన పర్యటనలు ఇప్పుడు ఫలితాలిస్తున్నాయి. విశాఖలో నిర్వహించిన పారిశ్రామిక సదస్సుకే 41 దేశాలకు చెందిన 1,400 మంది ప్రతినిధులు హాజరయ్యారు.  328 ఒప్పందాలు జరిగితే, వాటి వల్ల 4.67 లక్షల కోట్ల పెట్టుబడులతోపాటు 9.58 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశాలున్నాయి. విభజన తర్వాత అనేక ఒత్తిళ్లను అధిగమించిన చంద్రబాబు ప్రభుత్వం, పరిశ్రమల శాఖపై ప్రత్యేక దృష్టి సారించిన ఫలితంగా పారిశ్రామిక ప్రగతి దూసుకుపోతోంది.

2014-15 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక వృద్ధిరేటు 5.25 శాతం ఉండగా, 2015-16కు రెండంకెల వృద్ధిరేటు సాధించి, 11.1 శాతంగా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.6 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించే, 350 మెగా పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటుకానున్నాయి. సెల్‌కాన్ సంస్థ వచ్చే ఏడాది నుంచి ఉత్తత్తి ప్రారంభించనుంది. అంతర్జాతీయ స్థాయి కంపెనీ ఫాక్స్‌కాన్ దేశంలో తన మొదటి ప్లాంటును ఏపిలో నెలకొల్పింది. ప్రస్తుతం 9 వేల మందికి ఉపాధి కల్పిస్తోన్న ఈ సంస్థ మరో 15 వేల మందికి ఉపాధి కల్పించనుంది.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు ‘ఎంటర్ ప్రైజ్ ఆంధ్ర’ అనే సంస్థను ఏర్పాటుచేసింది. అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఇ పార్కులు నెలకొల్పనున్నారు. 4 వేల కోట్ల పెట్టుబడితో 7,500 యూనిట్లు నెలకొల్పగా, లక్షమందికి ఉపాధి లభించింది. నియోజకవర్గ స్థాయి నుంచే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా, స్థానికంగా ఉపాధి కల్పించి వలసలను నిరోధించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

SHARE