Posted [relativedate]
‘లవ్‌లీ’, ‘ప్రేమకావాలి’ చిత్రాలతో హీరోగా అలరించిన ఆది సాయికుమార్ వారసత్వంను నిలుపుతాడని అంతా ఆశించారు. కాని ఆ తర్వాత ఒక్కటి అంటే ఒక్కటి కూడా సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాయి. సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేస్తు తన ప్రయత్నాలు చేస్తూ వెళ్తున్న ఆది సక్సెస్‌లను అందుకోవడంలో మాత్రం విఫలం అవుతున్నాడు. సినిమాలు చేసి సక్సెస్‌లు కొట్టాలనే ఆది భావిస్తున్నాడు తప్ప, మంచి సినిమా చేయాలి, మంచి కథలు ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశ్యం ఆదిలో కనిపించడం లేదు.
ఆది ఇటీవలే ‘చుట్టాలబ్బాయి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకోలేక పోయాడు. అంతకు ముందు వచ్చిన ‘గరం’, ‘రఫ్’, ‘గాలిపటం’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ ముందు ఆదిని బొక్క బోర్లా పడేశాయి. ఎంత పడ్డా కూడా ఆది లేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఆ ప్రయత్నాలు అనేవి సరైన దిశగా సాగడం లేదనేది కొందరి వాదన. వరుసగా ఫ్లాప్‌లు వచ్చినా అదే తరహా సినిమాలు, ఒకే తరహా పాత్రతో సక్సెస్ కాలేక పోతున్నాడు. ప్రస్తుతం ఆది శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘శమంతకమణి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అది కూడా ఎప్పటిలాగే ఉండబోతుందనే టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా ఆది ఒక హర్రర్ కామెడీ సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బుల్లి తెర ప్రభాకర్ దర్శకత్వం వహించబోతున్న ఆ సినిమాతో అయినా ఆదికి సక్సెస్ దక్కుతుందేమో చూడాలి. ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయితే ఆది సర్దేసుకోవాల్సిందేనేమో.