ఆప్ తో పవన్ జనసేన పొత్తు ?

  aap kejrewal pawan janasena party mixed
ఆంధ్రాకి ప్రత్యేక హోదా అంశం మీద పవన్ మాట్లాడడంతో మళ్లీ జనసేన కార్యకలాపాల గురించి చర్చ మొదలయింది.అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి.అయితే హోదా విషయంలో పవన్ చెప్పిన ప్రతిమాటలో నిజాయితీ ధ్వనించింది.అయితే తప్పు జరిగితే మీ తరపున ప్రశ్నిస్తానని జనానికి ఇచ్చిన హామీ గురించి అయన సమాధానం చెప్పాల్సిఉంటుంది.మొత్తానికి పవన్ మౌనం జనసేన వ్యూహమేనని తాజా ప్రకటనతో స్పష్టమైంది.

పైకి మౌనంగా వున్నా పవన్,అయన వ్యూహకర్తలు రాజకీయ పరిణామాల్ని ,హోదా పోరాటాన్ని ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల్ని నిశితంగా పరిశీలిస్తున్నారు .దేశవ్యాప్త రాజకీయవాతావరణాన్ని అంచనా వేసుకుంటున్నారు .అవసరం ,అవకాశాన్ని బట్టి ముందడుగు వేయాలని భావిస్తున్నారు.పంజాబ్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే ఆ పార్టీతో కలిసి పనిచేసే విషయాన్ని జనసేన చురుగ్గా పరిశీలించవచ్చు.ఆప్ మీద ఇంత ప్రత్యేకదృష్టి పెట్టడం వెనుక భారీ వ్యూహమే ఉన్నట్టు తెలుస్తోంది.

ఒకప్పుడు రాష్ట్రరాజకీయాల్లో ఓ వెలుగువెలిగి ప్రస్తుతం విభజన కష్టాలు ,హోదా భాధలు అనుభవిస్తూ జాతీయ పార్టీల్లో ఇమడలేక …బయటకి రాలేక ఇబ్బంది పడుతున్న కొందరు నేతలు పవన్ ప్రకాశంలో మళ్లీ మెరిసిపోవాలని కలలు కంటున్నారు.అందుకోసం పవన్ కి రాజకీయ,ఆర్ధిక వ్యవహారాల్లో అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు.అధికార,ప్రతిపక్షాల్లోని అసంతృప్త నేతలు కూడా పవన్ ని సంప్రదిస్తున్నారు.అయితే వస్తున్న నేతల గతం,prp అనుభవాలని దృష్టిలో ఉంచుకొని కొత్తరక్తం వైపే నిలవాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం.

ఇక క్షేత్ర స్థాయి పరిస్థితులపై కూడా ఓ అంచనా వుంది.సాధ్యమైనంత వరకు కుల ముద్రకి దూరంగా ఉండాలని జనసేన భావన.అయితే prp ఎపిసోడ్ లో ఆ ముద్ర పార్టీ కి నష్టం చేసిందని పవన్ కి తెలియదా ?కాపులు,బీసీలను ఏకతాటిపైకి తెచ్చే వ్యూహాలపై అయన దృష్టి పెట్టారు.అయితే రిజర్వేషన్ అంశం అడ్డుగా వుంది.దీన్ని అధిగమించడంపై పవన్ కొందరు మేధావుల సలహాలు తీసుకుంటున్నారు.కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తో భేటీ లోను ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.

క్షేత్రస్థాయిలోఇన్ని సమస్యలున్నప్పుడు ఏపీలో ఓట్లే లేని ఆప్ వైపు జనసేన చూడడానికి వేరే కారణం వుంది.స్వచ్ఛ రాజకీయ ముద్రతో ఆ పార్టీ ఢిల్లీలో సాధించిన విజయం కన్నా మధ్యతరగతి వర్గాన్ని రాజకీయాల వైపు ఆకర్షించిన తీరు జనసేనానిని ఆకట్ట్టుకుంది.ఉదారవాదులు,తటస్థులు ఆప్ ని ఆదరించడం పవన్ కి ఆలా గుర్తుండిపోయింది.ఆయా వర్గాలు బయటకి వస్తే…రాజకీయాల్లో క్రియాశీలమైతే ..కులమతప్రాంత భావనల్ని అధిగమించే ఓ సామూహిక శక్తి అందివస్తుందని జనసేన వ్యూహకర్తలు ఆలోచిస్తున్నారు .సాంప్రదాయ వ్యూహాలతో ఎన్నికలకి వెళితే అదే రాజకీయం చేసే ప్రత్యర్ధులు ఇంకా అన్ని విధాలుగా బలవంతులు …ఈ విషయం తెలిసే ఆప్ విషయాన్ని జనసేన తీవ్రంగా పరిశీలిస్తోంది.అయితే ఆలా వచ్చిన ఆప్ లోను కొన్ని ఇబ్బందులున్నట్టు ఢిల్లీ పరిణామాలు రుజువు చేశాయి.అయితే పంజాబ్ లో దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూసి ..అక్కడి ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన ముందడుగు వేయొచ్చు.

SHARE