Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రభాస్ అంటే బాహుబలి మూవీ గుర్తొస్తుందా. అది మాత్రం కాదండీ. ఇది ఇంకా పాత సినిమా. ప్రభాస్ కు మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఛత్రపతి మూవీలో ఓ హిట్ డైలాగ్ ఉంది. ఒట్టేసి ఓ మాట, ఒట్టేయకుండా మరో మాట చెప్పనమ్మా అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్.. అభిమానులకు సూపర్ గా నచ్చింది. అందుకే ప్రభాస్ లాగే ఇతర పార్టీల్లోకి వెళ్లమని ఒట్టేసి చెప్పాలంటున్నారు కేజ్రీవాల్. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల తర్వాత కేజ్రీవాల్ తన నీడను కూడా నమ్మడం లేదు. గెలిచిన కాస్త మంది కార్పొరేటర్లు కూడా గోడ దూకేస్తారని ఆయనకు ఆందోళనగా ఉంది.
ఢిల్లీలో పవర్ అంతా సెంటర్ దే. అక్కడ బీజేపీ ఉంది. ఇక కాస్తో కూస్తో నిధులొచ్చే కార్పొరేషన్లలో కూడా ఆ పార్టీనే పాగా వేసింది. అటూ ఇటూ కాని రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి చేసేదేముందని చాలా మంది ఆప్ నేతల్లో అంతర్మథనం మొదలైంది. ఇప్పటికే ఆప్ నేతల అవినీతి ఇతర పార్టీ నేతల్ని మించిపోయిందని కేజ్రీవాల్ మాజీ గురువు అన్నాహజారే కూడా ఎద్దేవా చేశారు. ఇక కేజ్రీవాల్ అహంకారం గురించి ఇప్పటికే చాలా మంది నేతలు విమర్శలు చేశారు. ఇలాంటి సమయంలో పార్టీ క్యాడర్ కు మనోస్థైర్యం ఇవ్వాల్సిన కేజ్రీ.. ఇలా ఒట్లేయించుకోవడమేంటని ప్రశ్నలు వస్తున్నాయి.
70కి 67 సీట్లు గెలిచి రెండేళ్ల క్రితం ఢిల్లీని ఊడ్చేసిన చీపురు.. ఇప్పుడు కమలం దెబ్బకు కకావికలమౌతోంది. ఇప్పటిదాకా కేజ్రీవాల్ ఈవీఎంలను నిందించినా కామ్ గా ఉన్న పార్టీ నేతలు.. ఈసారి మాత్రం ఊరుకోలేదు. అసలు ఈవీఎంలలో సమస్య లేదని, మా పార్టీలోనే లోపాలున్నాయని కుండబద్దలు కొట్టారు చాలా మంది నేతలు. దీంతో కేజ్రీవాల్ గొంతులో పచ్చివెలక్కాయ పడింది. ఢిల్లీలాంటి రాష్ట్రం కాని రాష్ట్రంలో గెలిచి ప్రధాని కుర్చీ కోసం కలలు కన్న కేజ్రీవాల్.. ఇప్పుడు ఉన్న పీఠం చెదరిపోకుండా జాగ్రత్తపడుతున్నారు. కానీ చేతులు కాలాక ఏం పట్టుకున్నా ఫలితం లేదని ఈ ఐఐటీ స్టూడెంట్ కు తెలియదా.