ఆషాడంలో అమరావతికి రారంటా..

aashadam amaravathi velagapudiహైదరాబాద్ నుండి ఏపి తాత్కాలిక సచివాలయమైన వెలగపూడికి శాఖల తరలింపు ప్రక్రియలో మరింత జాప్యం జరుగనున్నది. పుష్కరాల ముందు మంచి ముహూర్తం లేదన్న కారణంతో పాటు తాతాల్కిక సచివాలయం నిర్మాణ పనులు కూడా సాగట్లేదు.  ఇప్పటికే వెలగపూడికి వెళ్ళిన పలు కార్యాలయాల సిబ్బంది పని వాతావరణం లేదన్న కారణంతో వెంటనే గోడకు కొట్టిన బంతి లాగ తిరిగి హైదరాబాద్‌కే చేరుకున్నారు. దాంతో శాఖల తరలింపులో పనుల్లో జాప్యం తీవ్ర ప్రభావం చూపుతున్నది. మరో వైపు కృష్ణా పుష్కరాలపై అందరి దృష్టి పడింది. పుష్కరాలకు ముందు ఎవరు కూడా నివాసాలు, కార్యాలయాల తరలింపు, గృహప్రవేశాలు తదితరాలకు ముహూర్తాలు పెట్టుకోరు. అదేసెంటిమెంట్ హైదరాబాద్ నుండి వెలగపూడికి కార్యాలయాల తరలింపుకు కూడా వర్తిస్తుందని పలువురు మం త్రులు సిఎంతో అన్నట్లు ప్రచారం సాగుతోంది.

దాంతోపాటు పనులు జరుగు తున్న బ్లాకుల్లో విలువైన ఫైళ్ళు, ఫర్నీచర్, కార్యాలయాల సమాచారాన్ని కార్మి కులకు వదలటం మంచిది కాదని కూడా పలువురు ఉన్నతాధికారులు సిఎం తో చెప్పినట్లు తెలిసింది. మంత్రులు, ఉన్నతాధికారుల వాదనతో సిఎం కూడా ఏకీభవించినట్లు సమాచారం. దాంతో ఈనెల 29వ తేదీన వెలగపూడిలో పూజలు నిర్వహించాలనుకున్న విభాగాధిపతులు మంత్రుల ఆదేశాల కారణం గానే పూజలను పుష్కరాల తర్వాతకు వాయిదా వేసుకున్నట్లు సమాచారం.

వాస్తవానికి జూన్ నెల 27వ తేదీకల్లా అన్నీ శాఖల విభాగాధిపతి కార్యాలయాలన్నీ హైదరాబాద్ నుండి వెలగపూడికి చేరుకోవాల్సిందేనంటూ ముఖ్యమంత్రి గట్టిగా హెచ్చరించారు. అప్పటికి వెలగపూడిలో అసలు పనులు ఒక స్ధాయికి కూడా చేరుకోలేదు. అదే విషయాన్ని పలువురు ఉన్నతాధికారులు సిఎంకు చెప్పినా పట్టించుకోలేదు. శాఖల తరలింపులో తన పంతమే నెగ్టాలన్నట్లు ముఖ్యమంత్రి గట్టిగా పట్టుబట్టారు. దాంతో పోయిన నెలలో 27వ తేదీకి పంచాయితీరాజ్, కార్మికశాఖల సిబ్బంది హైదరాబాద్ నుండి వెలగపూడికి వెళ్ళారు. వెలగపూడిలో నిర్మాణమవుతున్న మొత్తం ఐదు బ్లాకుల్లో తమకు కేటాయించిన బ్లాకుల్లోని కార్యాలయాల్లోకి సిబ్బంది ప్రవేశించారు. కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు.

అయితే, హైదరాబాద్ నుండి వెళ్ళిన బస్సుల్లోనే సాయంత్రం కాగానే హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం కట్టారు. ఆ తర్వాత వైద్య, ఆరోగ్య శాఖ, ఉద్యానవనశాఖలతోపాటు మరికొన్ని శాఖల ఉద్యోగులు కూడా హైదరాబాద్ నుండి వెలగపూడికి వెళ్ళారు, వచ్చారు. తాజాగా, రవాణా, రహదారులు, భవనాల శాఖతో పాటు విజిలెన్స్ శాఖల ఉన్నతాధికారులతో పాటు సిబ్బంది కూడా వెళ్ళి పూజలు చేసి అదే రోజు తిరిగి వచ్చేసారు. ఉదయం వెళ్ళిన సిబ్బంది సాయంత్రానికి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటున్నారంటేనే అక్కడ పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి ఆదేశాలను కాదనలేక ఉన్నతాధికారులు వెలగపూడికి చేరుకుంటున్నా అక్కడ పనిచేసే వాతావరణం లేకపోవటంతోనే మళ్ళీ హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు.

నిర్మాణంలో ఉన్న ఏ బ్లాకులో కూడా పనులు పూర్తి కాలేదన్నది వాస్తవం. కొన్ని శాఖలకు చెందిన సిబ్బంది హైదరాబాద్ నుండి పూర్తి స్ధాయిలో తరలివెళ్ళినా అక్కడ వాటిని ఉపయోగించుకునే వీలు కనబడలేదని వాపోతున్నారు. విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో కొన్ని విభాగాధిపతులు కార్యాలయాలు తీసుకున్నారు. సిబ్బందిని కూడా తరలించారు. అయితే, అవి ఏవీ ఇప్పటికిప్పుడు పని చేయటానికి అనువుగా ఉన్న భవనాలు కావు. విభాగాధిపతులు తీసుకున్న భవనాలన్నీ వాణిజ్య, నివాసాల కోసం నిర్మించిన భవనాలు, భవన సముదాయాలు.

అటువంటి భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలంటే సదరు భవనాల్లో కార్యాలయాలకు అనువుగా మళ్ళీ మార్పులు చేర్పులు చేయాలి. అందుకు సమయం పడుతుందని సదరు భవనాల యాజమాన్యాలు చెప్పాయి. దాంతో యాజమాన్యాలు చెప్పినట్లు వినకతప్పటం లేదు. అందుకని మళ్ళీ వారిలో అత్యధికులు హైదరాబాద్‌కే చేరుకుంటున్నారు. దానికితోడు తరచూ కురుస్తున్న వర్షాలు, ముఖ్యమంత్రి, మంత్రుల లాంటి ప్రముఖుల రోజు వారీ పరిశీలన వల్ల కూడా వెలగపూడి నిర్మాణాల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. వెలగపూడి నిర్మాణాలు ఆగష్టు నెలాఖరుకు గానీ పూర్తికాదని నిర్మాణ సంస్ధలు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుకే స్పష్టంగా చెప్పారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here