Posted [relativedate]
ఆర్కే నగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అమ్మ పార్టీ తరపున దినకరన్ పోటీ చేస్తున్నారు. చిన్నమ్మ ఆశీస్సులతో వెలుగులోకి వచ్చిన ఆయన… ఇప్పుడామెనే లైట్ తీసుకుంటున్నారు. ఉప ఎన్నికలో ఎక్కడా శశికళ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతున్నారు. అంతేకాదు పార్టీ నాయకులకు కూడా ఆమె పేరే ఎత్తొద్దని గట్టిగా ఆదేశాలిచ్చినట్టు సమాచారం.
అసలే శశికళపై ఆర్కే నగర్ లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ తరుణంలో చిన్నమ్మ పేరెత్తితే ఓట్లు పడేలా లేవు. అందుకే గతంలో జయలలిత చేపట్టిన మంచి కార్యక్రమాలు… ఇప్పుడు పళనిస్వామి సర్కార్ గురించి మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా శశికళ ప్రస్తావనే లేదు. కనీసం ఫ్లెక్సీలో చూద్దామన్నా ఆమె ఫోటో కనిపించడం లేదు.
ఇక క్యాంపెయిన్ లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, వాల్ పోస్టర్లలో ఎంజీఆర్, జయలలిత ఫోటోలు పెద్దగా కనిపిస్తున్నాయి. ఎక్కడా చిన్నమ్మ ఫోటో మచ్చుకైనా లేదు. ఈ విషయం శశికళ దృష్టికి వెళ్లిందట. దానికి దినకరన్ వర్గం నుంచి గట్టి సమాధానం ఇచ్చిందని టాక్. ప్రస్తుతానికి పరిస్థితి బాగా లేదని.. మీ మాటెత్తితే బెడిసికొట్టడం ఖాయమని చిన్నమ్మకు వివరించారని సమాచారం.
ఇప్పటికే బెంగళూరు జైలుకు వస్తున్న లెటర్లతో ఆమె పరేషాన్ అవుతున్నారు. కాబట్టి దినకరన్ వర్గం అభిప్రాయంతో ఏకీభవించారట. సరే.. ఎలాగోలా ప్రస్తుతానికి కానివ్వండి అని అయిష్టంగానే అంగీకరించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి చిన్నమ్మ ఫోటో లేకుండానే దినకరన్ పోటీ చేయడం.. దానికి ఆమెను ఒప్పించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుకే సీఎం పళనిస్వామి కూడా దినకరన్ తో జాగ్రత్త పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎందుకైనా మంచిదని.. ఆయనతో జాగ్రత్తగా నడుచుకోవాలనే నిర్ణయానికి వచ్చారట.