దొరకని జాడ.. ఎయిర్ ఫోర్స్ విమాన గాలింపు.

0
599
airforce aeroplane missing
అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం ఆచూకీకోసం బంగాళాఖాతం లో అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు.. భారత వాయుసేన, నౌకాదళం సిబ్బంది ఐదు హెలికాప్టర్లు, రెండు విమానాల ద్వారా విమానంకోసం వెతుకుతున్నారు. నాలుగు యుద్ధ నౌకలతో పాటు సబ్ మెరైన్ను రంగంలోకి దించారు. కోస్ట్ గార్డ్ బృందాలు కూడా గాలింపు జరుపుతున్నాయి. చెన్నైకు తూర్పు దిశగా 200 నాటికల్ మైళ్ల దూరంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కొద్దిసేపటి క్రితం తమిళనాడులోని తాంబరం ఎయిర్ బేస్ లో అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. గాలింపు చర్యలపై ఆరా తీసిన ఆయన మరింత ముమ్మర గాలింపు చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. గాలింపు చర్యలను పారికర్ తాంబరంలోనే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు, అండమాన్ కు 144 నాటికల్ మైళ్ల దూరంలో ఈ విమానం పడిపోయి ఉండవచ్చని కోస్ట్ గార్డ్ ఫ్లాగ్ ఆఫిసర్ అలోక్ భట్నాగర్  సందేహం వ్యక్తం చేశారు. సదరు విమానం కోసం జలాంతర్గామి, 12 నౌకలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు అలోక్ వివరించారు.
విమాన జాడ కోసం పలు దేశాల సహాయం..
అటు విమానం జాడకోసం భారత ప్రభుత్వం శ్రీలంక, సింగపూర్, మలేసియాలను కూడా సహాయం కోరింది…. శుక్రవారం తమిళనాడులోని తాంబరం నుంచి బయలుదేరిన ఈ విమానం పోర్ట్ బ్లెయిర్ వెళుతుండగా కనిపించకుండా పోయింది.. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు గాల్లోకి ఎగిరిన 16 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. ఎయిర్‌పోర్టు వర్గాలు వెంటనే ఈ విషయాన్ని వాయుసేన అధికారులకు తెలిపారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ఉండొచ్చని భావిస్తున్నారు. గల్లంతైన ఏఎన్ 32 విమానంలో 8 మంది ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంకు చెందిన వారు ఉన్న సంగతి తెలిసిందే.

Leave a Reply