Posted [relativedate]
రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలు రాజకీయాలు చేయాలంటే కత్తి మీద సామే. అలాంటి జిల్లాలో భూమా కుటుంబం మూడు దశాబ్దాలుగా పట్టు నిరూపించుకున్న నియోజకవర్గాలు నంద్యాల, ఆళ్లగడ్డ. ఇక్కడ ఎవరు నిలబడ్డా, మరెవరు గెలవాలన్నా భూమా కుటుంబ ఆశీర్వాదం కావాల్సిందే. మూడేళ్ల క్రితం తల్లిని కోల్పోయిన అఖిలప్రియ.. ఆళ్లగడ్డలో భారీ మెజార్టీతో గెలిచారు. కానీ రీసెంట్ గా తండ్రిని కోల్పోయిన అఖిలప్రియ.. నంద్యాలను కూడా వదలకూడదని డిసైడయ్యారు. తమ కుటుంబం ఛానెల్ పెడుతోందని అఖిలప్రియ చెల్లి మౌనిక ప్రకటించడం.. ఏపీ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్ అయింది.
శోభా నాగిరెడ్డి వారసురాలిగా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న అఖిలప్రియ.. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయగా కూడా రాణించాలని భావిస్తున్నారు. నంద్యాల, ఆళ్లగడ్డలో కుటుంబానికి ఉన్న పట్టును కాపాడుకోవాలని, తండ్రిని నమ్ముకున్న నేతలెవరికీ అన్యాయం జరగకూడదని అఖిల పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే సెంటిమెంట్ డైలాగ్స్ తో అటు ప్రతిపక్షాల్ని, ఇటు సొంత పార్టీలో ప్రత్యర్థుల్ని కూడా ముక్కున వేలేసుకునేలా చేస్తున్న అఖిలప్రియ.. నంద్యాల గడ్డపై తన మార్క్ రాజకీయం చూపించడానికి రెడీ అయ్యారు.
నంద్యాల ఉపఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోతే.. పార్టీ మరతామని శిల్పా బ్రదర్స్ ఇప్పటికే చంద్రబాబుకు సంకేతాలు పంపిస్తున్నారు. దీంతో అఖిలప్రియ ముందే అలెర్టయ్యారు. తండ్రికి నమ్మకస్తులైన నేతల్లో ఎవరో ఒకర్ని ఎంపిక చేయడం.. లేదంటే చెల్లి మౌనికను రంగంలోకి దించడం ద్వారా శిల్పా బ్రదర్స్ కు చెక్ పెట్టాలని ఆమె భావిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గాల ప్రజల్లో మాత్రం భూమా కుటుంబంపై విపరీతమైన సానుభూతి ఉంది. చిన్నవయసులోనూ ఆడకూతుళ్లు పేరెంట్స్ ను కోల్పాయారని జాలి ఉంది. నియోజకవర్గ ప్రజలు తమను పిల్లల్లా చూసుకుంటున్నారన్న అఖిల ప్రకటన.. భూమా కుటుంబానికి మరింత నైతిక బలం పెరిగేలా చేసింది. ఇప్పుడు భూమా కుటుంబాన్ని కాదని ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి అఖిల కొనసాగిస్తారని అనుచరుల్లో కూడా కొండంత ధీమా వచ్చేసింది.