తెలుగు రాష్ట్రాలే దేశానికి ఆదర్శం

0
491
all states said loan waiver for winning in elections

Posted [relativedate]

all states said loan waiver for winning in electionsఅక్షర క్రమంలో ముందుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు ఎన్నికల హామీల విషయంలో కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. 2014 ఎన్నికల సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చిన రుణమాఫీ హామీ జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మీడియా, మేధావులు అనుకూల, ప్రతికూల వర్గాలుగా చీలిపోయి చర్చలు జరిపారు. కానీ చాలామంది ఊహించని విధంగా ఎన్నికల్లో రుణమాఫీ రామబాణంలా పనిచేసిందని తేలింది. మొదటగా రుణమాఫీ హామీని టీడీపీ అధినేత చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఆ హామీకి ఊహించని స్పందన వస్తుందని గమనించిన కేసీఆర్.. తెలంగాణలో కూడా తామూ రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.

2014 ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల సక్సెస్ ఫార్ములా ను ఆ తర్వాత ఎక్కడ ఎన్నికలు జరిగినా.. పార్టీలు కాపీ కొట్టాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో యూపీలో రుణమాఫీ చేస్తామని బీజేపీ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే స్వతహాగా మోడీకి ఇలాంటి ఉచిత హామీలు ఇవ్వడం ఇష్టం ఉండదు. అయితే యూపీ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కమలనాథులు.. ఇక్కడ చంద్రబాబు స్ట్రాటజీనే ఫాలో అయ్యారు. చివరకు ఇచ్చిన హామీ మేరకు లక్షలోపు రుణాలన్నీ మాఫీ చేస్తామని.. తొలి క్యాబినెట్ లోనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు.

అటు ఢిల్లీలో తమిళనాడు రైతుల కపాలాల ప్రదర్శన మద్రాస్ హైకోర్టును కదిలించింది. ఐదెకరాల్లోపు రైతులకే రుణమాఫీ చేయడం పద్ధతి కాదని, రైతులందరికీ మాఫీ చేయాలని కోర్టు తమిళనాడు సర్కారుకు అక్షింతలు వేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి.. కేంద్రం కూడా ఆసరా ఇవ్వాలని సూచించింది. దీంతో కేంద్రం నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. ఇప్పటికే యూపీ రుణమాఫీకి కేంద్రం నిధులు సమకూరుస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు తమిళనాడుకు కూడా మాఫీ నిధులిస్తే.. అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్లు పెరుగుతాయని కేంద్రం కలవరపడుతోంది. ఏదేమైనా మన దగ్గర సక్సెస్ అయిన రుణమాఫీ హామీ.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ సేలబుల్ గా మారింది.

Leave a Reply