పుష్కర విషాదం

0
433

 amaravathi pushkara vivadam 5 members death

గుంటూరు జిల్లా అమరావతి వద్ద కృష్ణా పుష్కరాల్లో విషాదం జరిగింది. పుష్కర స్నానం చేయడానికి నదిలో దిగిన ఐదుగురు యువకులు నీట మునిగి మరణించారు. కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏటూరు వద్ద పుష్కరస్నానానికి వెళ్లిన నందిగామ చైతన్య కాలేజీకి చెందిన 11మంది యువకులు  ఒక పడవ మాట్లాడుకుని చందర్లపాడు మండలం ఏటూరు రేవు నుంచి గుంటూరు జిల్లా వైపున్న దిగుడు రేవుకు చేరుకున్నారు. అనంతరం వారు ఈత  కోసం అక్కడ దిగారు.

ఆ ప్రాంతంలో బాగా లోతుగా ఉండటంతో ఐదుగురు విద్యార్థులు మునిగిపోగా మిగిలిన ఆరుగురు ఒడ్డుకు చేరారు.  మరణించిన వారిని చందర్లపాడు మండలం తోటరావులపాడుకు చెందిన హరీష్‌, నందిగామ మండలం చెరుకుంపాలేనికి చెందిన గోపిరెడ్డి, నందిగామ వాసులు గణేష్‌, లోకేష్‌, హరిగోపిగా గుర్తించారు. 11 మంది యువకులు నందిగామలోని  చైతన్య కాలేజీలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. గజ ఈతగాళ్లు ఆ ప్రాంతంలో గాలించి నలుగురి మృతదేహాలను వెలికి తీశారు.

కాగా మునిగిపోయిన ప్రాంతంలో 20 అడుగులకు పైగా లోతులో ఇసక తవ్వేయడం వల్లనే లోతు ఎక్కువని, పైగా పులిచింతల ప్రాజెక్ట్ నుంచి పుష్కర స్నానాల కోసం 10,500 క్యూసెక్కుల నీటిని వదలడంతో ఆ విషయం తెలియని విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారని తెలిసింది.ఇసుకాసురులు నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తవ్వడమే ఈ దుర్ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ విజయకుమార్ ప్రమాదస్థలికి వెళ్లారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో లోతు ఎక్కువని బోర్డులు పెట్టామని, అయినా విద్యార్థులు వాటిని గమనించకుండా వెళ్లారని, ఈ ప్రమాదానికి ఎవరూ బాధ్యులు కారని చెప్పారు. అయితే.. గజ ఈతగాళ్లు సకాలంలో ప్రమాదస్థలికి వచ్చినా.. ఇంత లోతులోకి తాము కూడా దిగలేమని చేతులు ఎత్తేశారని, వారు చొరవ చేస్తే తమ స్నేహితులు బతికేవారని ప్రాణాలతో బయటపడిన ఒక విద్యార్థి కన్నీళ్లతో చెప్పాడు. దీన్ని బట్టి ఈత వచ్చిన వారిని అధికారులు నియమించలేదని తెలుస్తోంది.

Leave a Reply