ఆంధ్రజ్యోతి సర్వే పోస్టుమార్టం…

0
441
0650f769bbe284025490b94826acb37d

Posted [relativedate]

Related image
ఏపీ లో మళ్లీ అధికారం టీడీపీ దే నంటూ ఆంధ్రజ్యోతి వెల్లడించిన సర్వే మీద చర్చోపచర్చలు సాగుతున్నాయి.సహజంగానే వైసీపీ ఆంధ్రజ్యోతి సర్వేని తప్పుపడుతోంది.ఇది కావాలనే తప్పుడు సర్వే ప్రచురించారని అంటోంది.అందులో నిజానిజాలు పక్కనపెడితే అసలు సర్వే నిర్వహణలో ఉన్న లోపాలు ఇప్పటికే చాలాసార్లు బయటపడ్డాయి.సాంకేతికంగా ఉన్నతస్థాయి అనుకునే అమెరికాలోను ఏమి జరిగిందో చూసాం.హిల్లరీ గెలుపు తధ్యమని 98 శాతం సంస్థలు చెపితే …2 శాతం మాత్రమే ట్రంప్ కి అనుకూలంగా తీర్పు వస్తుందని అంచనా వేసాయి.చివరకు ఏమి జరిగిందో చూసాం.అంటే తప్పు సర్వే సంస్థల్లో కాదు అవి పాటిస్తున్న విధానాల్లో అని తెలుస్తోంది.ఇప్పుడు ఆంధ్రజ్యోతి సైతం తాము సర్వే కోసం అనుసరించిన విధానాన్ని కూడా వెల్లడించింది.అందులో ఉన్న లోపాల్ని విమర్శనాత్మకంగా విశ్లేషించే ప్రయత్నమే ఇది ..

మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 23 స్థానాలను ఆంధ్రజ్యోతి సర్వే కోసం ఎంపిక చేసుకుంది.
ఒక్కో నియోజక వర్గంలో 1500 మంది నుంచి అభిప్రాయసేకరణ జరిపింది.వెయ్యి మందిని కేవలం మౌఖికంగా,మిగిలిన 500 మందిని లిఖితపూర్వకంగా ప్రశ్నించింది.

అంటే మొత్తం 175 నియోజక వర్గాలకి గాను 34 ,500 మందిని ప్రశ్నించింది.ఇందులో అన్ని కులాలు,మతాలు,వయసు,స్త్రీ పురుషులు,ప్రాంతాలు ఉండేట్టు చూసుకుని ప్రశ్నించామని ఆంధ్రజ్యోతి ప్రకటించింది.ఇది ఎప్పటినుంచో సాగుతున్న విధానమే.అయితే ఉదాహరణకి ఓ నియోజకవర్గాన్ని …అందులో ఓ ఊరుని తీసుకుందాం.ఆ నియోజకవర్గ ఓటర్ సంఖ్య లక్షన్నర,ఆ ఊరి ఓటర్లు 1000 అనుకుందాం.ఇప్పుడు ఆంధ్రజ్యోతి తీసిన నిష్పత్తి ప్రకారం ఆ ఊరిలో తీయవలసిన శాంపిల్ 10 మంది ఓటర్లు మాత్రమే.కానీ ఆ ఊరిలో కులాలే 15 కి పైగా వున్నాయి.పైగా ఒక్కో కులంలో రెండు మూడు వర్గాలున్నాయి.అప్పుడు మెజారిటీ కులం నుంచి కూడా ఒక్కటే శాంపిల్ తీస్తే మిగిలిన ఒకటిరెండు వర్గాల అభిప్రాయం ఎక్కడ పరిగణనలోకి వస్తుంది?దీనికి పెద్ద తెలివితేటల అక్కర్లేదు.ఒకే ఊరిలో…ఒకే కులంలో రెండు లేదా మూడు పార్టీ ల అభిమానులుంటే …ఆ కులం నుంచి కేవలం ఒక్క శాంపిల్ తీయాల్సి ఉంటే ఎవరిది తీస్తారు? అంటే పైకి చెప్పినంత తేలిగ్గా సర్వే నిర్వహణ ఉండదు.పైగా వందలకొద్దీ కులాలు…అందులోనే భిన్నాభిప్రాయాలు వుండే సంక్లిష్ట సమాజంలో పాశ్చాత్య పద్ధతిని అనుసరించే సర్వే ల వల్ల ప్రయోజనం ఉండదు.ఢిల్లీ,బీహార్,తమిళనాడు ఎన్నికలతో వరసగా సర్వే విధానాల్లో లోపాలు బయటపడుతూనే వున్నాయి.అయినా ఆ తప్పులపై కన్నేయకుండా ఆ నెపాన్ని సంస్థల మీద వేసి పార్టీలు మరో సంస్థని వెదుక్కుంటున్నాయి.అసలు సెఫాలజి పేరిట ప్రస్తుతం సాగుతున్న సర్వే విధానాల్లో లోపాల్ని పట్టించుకోకుండా కేవలం వాటి ఫలితాల గురించి ఎంత చర్చించుకున్నా ఫలితముండదు.

ఇప్పుడు ఆంధ్రజ్యోతిని చూడండి..సర్వే ఫలితాన్ని హైలైట్ చేసింది.తాము తీసిన శాంపిల్ లో అన్ని కులాలు,మతాలు,వయసులు,స్త్రీపురుషులు ఉండేలా చూసుకున్నామని చెప్పింది కానీ దాని లోతుల్లోకి వెళ్ళలేదు.పై ఉదాహరణ చూసాక వాళ్ళు చెప్పినట్టు చెయ్యడం అసాధ్యమని తేలిగ్గా చెప్పొచ్చు.ఇది కేవలం ఆంధ్రజ్యోతికి మాత్రమే పరిమితమైన విధానం కాదు.మొత్తం సర్వే సంస్థలు ఇవే తప్పులు చేస్తున్నాయి.పైగా ఈ ఫలితాలు కూడా కేవలం తెల్లవారి హాట్ గా వచ్చే న్యూస్ పేపర్ సాయంత్రానికి చల్లబడినట్టు అయిపోతాయి తప్ప పార్టీలు ఎదుర్కొనే సమస్యలకి ఎలాంటి పరిష్కారాలు చూపవు.కనీసం ప్రయత్నించవు.చివరిగా ఒక్క మాట …కూర రుచి చూసి కేవలం బాగుంది …బాగాలేదు అని చెప్తే ప్రయోజనమేంటి?వాటిలో ఉప్పు,కారం,పులుపు,మసాలా లాంటివి ఎక్కువయ్యాయో..తక్కువ అయ్యాయో చెప్తేనే ప్రయోజనం.లేకుంటే నో యూజ్.కాదంటారా?

Leave a Reply