Posted [relativedate]
తమిళ యువత పోరాట పటిమతో జల్లికట్టు ఆర్డినెన్సు వచ్చాక ఏపీ లో మళ్లీ ప్రత్యేక హోదా అన్న మాట వినిపిస్తోంది.తమిళ్ తంబీలకు ఈ విషయంలో థాంక్స్ చెప్పాల్సిందే.ఆ స్ఫూర్తితో ఏపీ యువత ఓ నిరసన కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం ఆసక్తి రేకెత్తిస్తోంది.అంతకన్నా చిత్రం ఏమిటంటే తమిళనాట ఒక్క మెరీనా బీచ్ లోనే యువత ఆందోళనకు దిగితే ఏపీ కుర్రోళ్ళు ఏకంగా మూడు వేదికలు ఎంచుకున్నారు.ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం రోజే ఈ నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.ముందుగా వైజాగ్ ఆర్కే బీచ్ ఒక్క చోటే యువత స్పెషల్ స్టేటస్ డిమాండ్ తో నిరసన తెలుపుతుందని అనుకున్నా…తాజాగా తిరుపతి ఎస్.వి యూనివర్సిటీ,విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతంలో కూడా నిరసన వేదికలు నిర్వహించాలని యువత నిర్ణయించినట్టు తెలుస్తోంది.
యువత విశాఖ ఆర్కే బీచ్ లో స్పెషల్ స్టేటస్ కోసం ఉద్యమిస్తే జనసేన మద్దతుగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.వైసీపీ కూడా రంగంలోకి దిగితే జై ఆంధ్ర ప్రదేశ్ పేరుతో తలపెట్టిన ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమం ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు కానుంది.అన్ని పార్టీలు తమ జెండాలు మాత్రం పక్కనబెట్టి తమ జనాలతో ఈ నిరసన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటే ఓ భారీ ఉద్యమానికి ఊపిరిలూదినట్టే.అదే జరిగితే పవన్,జగన్ ని ఎదురుదాడితో నోరుమూయించినంత తేలిగ్గాదు పరిస్థితిని చక్కదిద్దడం.ఈ సమస్యని సీఎం చంద్రబాబు,ప్రధాని మోడీ ఎలా డీల్ చేస్తారో చూడాలి.