ఆ మంత్రి రియో టూర్ ..ఖర్చు కోటి

0
564

  anil vij rio olympics tour cost 1 crore rupees

మ‌న‌దికాక‌పోతే.. ఎంతైనా ఖ‌ర్చుపెట్టేద్దాం అనుకున్నారో ఏమో హ‌ర్యానా మంత్రిగారు త‌న మందీ మార్బలంతో ఎంచ‌క్కా.. టూర్‌కు చెక్కేశారు. అమాత్యుల‌వారి టూరు ఖ‌ర్చు అక్షరాలా కోటి! ఇది ఈయ‌న జేబు నుంచి కాకుండా ప్రజ‌ల ఖ‌జానా నుంచి చెల్లిస్తుండ‌డంతో దాని విలువ తెలీడం లేదు స‌ద‌రు మంత్రివ‌ర్యుల‌కు. ఇంత‌కీ ఇంత‌డ‌బ్బు పెట్టి అయ్య‌గారు వెళ్తోంది ఏ అధ్య‌య‌న యాత్ర‌కో కాదు.. ప్రజల‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌నుల‌కో కాదు.. ! అక్షరాలా ఆడుకోడానికి! అవును ఆడుకోడానికే! ప్రస్తుతం బ్రెజిల్‌లోని రియోలో ఒలింపిక్స్ జ‌రుగుతున్నాయి.

ఈ క్రీడ‌ల్లో పాల్గొనేందుకు హ‌ర్యానా నుంచి కూడా ఓ టీం వెళ్లింది. భారతదేశం నుంచి మొత్తం 119 మంది ఒలింపిక్స్‌కు వెళ్లగా, వారిలో అత్యధికంగా 20 మంది హర్యానావాళ్లే ఉన్నారు. దీంతో హ‌ర్యానాలో ఒలింపిక్ వేడి రాజుకుంది.అయితే, ఇది మంత్రి వ‌ర్గానికి కూడా పాకింది. ఇంకేముంది ఒలింపిక్‌లోని త‌మ టీంను ఎంక‌రేజ్ చేసే నెపంతో హర్యానా క్రీడాశాఖ మంత్రి అనిల్ విజ్ మొత్తం 9 మంది సభ్యులతో కలిసి రియో ఒలింపిక్స్ చూసేందుకు శ‌నివారం విమానం ఎక్కేస్తున్నారు.

తన ప్రైవేటు కార్యదర్శి, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి మీడియా సలహాదారు, అదనపు ప్రధాన కార్యదర్శి (క్రీడలు), ఆయన ప్రైవేటు కార్యదర్శి, క్రీడాశాఖ సంయుక్త డైరెక్టర్.. వీళ్లంతా మంత్రిగారితో పాటు బ్రెజిల్ వెళ్తున్నారు. వీళ్లలో ఒక్కరు మాత్రం గతంలో హాకీ జాతీయ క్రీడాకారుడు. మిగిలిన ఎవ్వరికీ క్రీడల్లో ఏమాత్రం అనుభవం లేదు. అయినా.. మంత్రిపోస్టు అడ్డుపెట్టుకుని విజ్ ఈ ప‌ర్యాట‌కానికి తెర‌దీశారు.

అయితే, ఇక్కడ కాష‌న్ ఏంటంటే.. ఇప్ప‌టికే త‌న వంది మాగ‌ధుల‌తో రియోకి వెళ్లిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్‌కు అక్క‌డ హై షాక్ త‌గిలింది. గోయల్ వెంట వెళ్లినవాళ్లు అక్కడ సిబ్బంది పట్ల అమర్యాదగా ప్రవర్తించారంటూ ఏకంగా గోయల్ అక్రిడేషన్ రద్దుచేస్తామని ఐఓసీ బెదిరించింది. ఇలాంటి తరుణంలో ఇలా జనాన్ని వెంటేసుకుని ఒలింపిక్స్ చూసేందుకు హ‌ర్యానా మంత్రి వెళ్తుండ‌డం… ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు రూ. కోటికిపైగా ఖ‌ర్చు పెడుతుండ‌డంపై సామాజిక మాధ్య‌మాల్లో విమ‌ర్శ‌ల బాణాలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply