ఏపీ అసెంబ్లీ ఈసారికి అక్కడే?

AP-Court

నవ్యాంధ్రలో శాసనసభ సమావేశాలు జరగాలని కోరుకుంటున్న వారికి మళ్లీ నిరాశ తప్పేలా లేదు. వచ్చే నెలలో జరగనున్న శీతాకాల సమావేశాలు అమరావతిలో నిర్వహించేందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపించడం లేదు.ప్రస్తుతం వెలగపూడిలో నిర్మిస్తున్న అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు ఇంకా పూర్తికాలేదు. వచ్చే నెలలో తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. పార్లమెంటులో జిఎస్‌టి బిల్లు ఆమోదించిన నెలరోజుల్లోనే, అసెంబ్లీలలో కూడా దానికి ఆమోదం తెలపవలసి ఉంటుంది. ఆ ప్రకారంగా వచ్చే నెలలో సుమారు 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది.

అయితే, వెలగపూడిలో అసెంబ్లీ భవన నిర్మాణాలు పూర్తి కాకపోవడం, ప్రైవేటు భవనాల్లో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఆసక్తి ప్రదర్శించకపోవడం వంటి కారణాలతో ఈసారి అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్‌లోనే జరిగే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ సమావేశాలను కెఎల్ యూనివర్శిటీలో నిర్వహించేందుకు స్థల పరిశీలన చేశారు. హాయ్‌ల్యాండ్‌ను కూడా పరిశీలించారు. ఎమ్మెల్యేలకు హోటళ్లలో బస ఏర్పాటుచేయాలని భావించారు.

అంతకుముందు నాగార్జున యూనివర్శిటీ భవనాలను కూడా స్పీకర్ కోడెల పరిశీలించారు. కానీ రాజకీయపరమైన సెంటిమెంటు కారణంతో, నాగార్జున యూనివర్శిటీలో అసెంబ్లీ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించలేదు. అక్కడ సమావేశాలు నిర్వహించిన వారికి పదవీగండం తప్పదన్న ప్రచారమే దానికి కారణం.ఇక ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తే దాని ఖర్చు భరించడం కష్టమని ఆర్ధిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా చెప్పడంతో ఆ ప్రతిపాదన కూడా పక్కకు పెట్టారు.

ప్రైవేటు భవనాల్లో అసెంబ్లీ నిర్వహణకు 12 కోట్లు అంచనా వేశారు. అసెంబ్లీ నిర్వహణ ఎక్కడన్న దానిపై ప్రముఖుల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కావడం లేదు. నవ్యాంధ్రలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ కోడెల మొదటినుంచి పట్టుదలతో ఉన్నారు. కానీ సెంటిమెంటు, ఆర్ధికభారం పేరుతో ఆయన ప్రయత్నాలు ఎప్పటికప్పుడు నీరుగారిపోతున్నాయి.

SHARE