Posted [relativedate]
కేంద్ర ప్రభుత్వంపై పవన్ వైఖరి తరహాలోనే.. ఏపీలో టీడీపీ సర్కారుపై తమ వైఖరి ఉంటుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రాన్ని తప్పుబడుతున్న పవన్ ధోరణిలో తప్పు లేదన్న వీర్రాజు.. త్వరలోనే పవర్ స్టార్ తన వైఖరి మార్చుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మోడీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే ఆయనలో మార్పు తెస్తాయన్నారు. అలాగే ఏపీలో మిత్రపక్షమైనంత మాత్రాన జరుగుతున్న తప్పుల్ని చూస్తూ ఊరుకునేది లేదని వీర్రాజు స్పష్టం చేశారు.
జులైలో విశాఖలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అవసరమైతే టీడీపీ సర్కారులో జరుగుతున్న పొరపాట్లను కూడా ఎత్తిచూపుతామన్నారు. జరుగుతున్న తప్పుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మిత్రపక్షం కాబట్టి భజన చేయాలని ఏమీ లేదని, తప్పు తప్పని చెబుతామని స్పష్టం చేశారు సోము వీర్రాజు. కొన్నాళ్లుగా టీడీపీపై విమర్శలు తగ్గించిన వీర్రాజు.. మళ్లీ లైన్లోకి రావడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తాయి. తన ఉనికి కాపాడుకోవడానికే ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తున్నారని మండిపడుతున్నారు టీడీపీ నేతలు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకపోయినా.. తమ అధినేత బీజేపీపై మాట పడనీయకుండా తానే నిందలు మోస్తున్నారని గుర్తుచేస్తున్నారు. మిత్రధర్మాన్ని పాటిస్తున్న చంద్రబాబును రెచ్చగొడితే.. బీజేపీకి ఏపీలో పుట్టగతుల్లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని. మోడీ మాత్రం ఏపీకి నీళ్లు, మట్టి తప్ప ఏమీ ఇవ్వలేదని పసుపు క్యాడర్ భగ్గుమంటోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తేడా ప్రకటనలు వస్తే.. అమీతుమీ తేల్చుకుంటామంటున్నాయి టీడీపీ శ్రేణులు.