అయోమయం లో ఏపీ కమలం..

 ap bjp politicians disappointed ap special statusభారతీయ జనతా పార్టీ నేతల్లో నైరాశ్యం పేరుకుపోతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న ఉత్సాహం కానీ రాష్ట్రంలోని అధికార పార్టీకి మిత్రపక్షమన్న సంతోషం గానీ కమలంపార్టీ నేతల్లో మచ్చుకు కూడా కనబడటం లేదు. రాష్ట్ర విభజన తర్వాత యూపిఏ  ఇచ్చిన హామీలను  కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో విమర్శలు తీవ్రమయ్యాయి. అటు కేంద్రం నిర్లక్ష్యంపై ప్రశ్నించలేక, ఇటు మిత్రపక్షంగా టిడిపితో పూర్తిగా మమేకం కాలేక పోవటంతో కమలనాధులు అనేక అవస్థలు పడుతున్నారు.  సెంటిమెంట్‌గా స్ధిరపడిపో యిన ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజి, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ లాంటి అంశాల పై ప్రజలను సమాధాన పరచలేకపోతున్నారు. దీంతో బీజపాపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. క్షేత్రస్ధాయిలో పార్టీపట్ల ప్రజల్లో పెరిగుతున్న వ్యతిరేకతను రాష్ట్ర పార్టీ నేతలు కేంద్ర నాయకత్వం దృష్టికి ఎన్ని మార్లు తీసుకెళ్ళినా ఉపయోగం కనబడలేదని సమాచారం.

దాంతో ఈ విష యమై ఏమీ చేయలేక ఒక విధంగా రాష్ట్ర నాయకత్వం చేతులెత్తేసింది. ముప్పేట సమస్యలతో రేపటి ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలో కమలనాధులకు అర్ధం కావటం లేదు. ఈ ఏడాది చివరలో జరుగుతుంద నుకుంటున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంలో  నేతల్లో ఇప్పటి నుండే ఆందోళన కనబడుతోంది. దానికితోడు టిడిపితో మిత్రపక్షంగా కలిసి ఎన్నికలను ఎదుర్కోవాలంటే ఒక సమస్య, ఒంటరిగా పోటీ చేయాలంటే మరో సమస్య బీజేపీ నేతలను బాగా ఇబ్బంది పెడుతోంది.

మరో వైపు రెండేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలోని నేతల్లో ఒక్కరికి కూడా చెప్పుకోదగ్గ నామినేటెడ్ పోస్టు ఒక్కటీ దక్కలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్ధలు, ప్రభుత్వ రంగ సంస్ధలు ఎన్నో ఉన్నా వాటిల్లో డైరెక్టర్లుగా నియమించటానికి అవకాశం ఉన్నా కూడా ఆ దిశగా కేంద్ర నాయకత్వం దృష్టి సారించలేదు. కేంద్ర నాయకత్వమే దృష్టి సారించలేదా లేక రాష్ట్రంలోని అగ్రనేతలెవరైనా నామినేటెడ్ పోస్టులు దక్కనీయ కుండా అడ్డుపడుతున్నారా అన్న విషయాన్ని కూడా రాష్ట్ర నేతలు తేల్చుకోలేకున్నారు. 

SHARE