రాత్రి నుంచి ఆ పార్టీ రాష్ట్ర నేతలకి ఫోన్ ఫోబియా పట్టుకుందట. జైట్లీ సమాధానం విన్నాక దేశం నేతలకన్నా ఆ పార్టీ వాళ్లే తెగ ఫీల్ అయిపోతున్నారంట. ఇంతకీ వాళ్ళు ఎవరో కాదు.. రాష్ట్ర బీజేపీ నేతలు. ఇప్పటి దాకా ఏదో చెప్పి నెట్టకొచ్చినా ఇకజనం దగ్గరికి ఎలా వెళ్లాలని వీళ్ళు మధనపడిపోతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి కమలం గూటికి చేరిన వాళ్ళదీ ఇదే పరిస్థితి. ఇక్కడికొచ్చి ఇలా ఇరుక్కుపోయామే అని వగరుస్తున్నారు.
వీళ్ళ గోడులో వీళ్ళుంటే ఇక పరిచయస్తులు, తెలిసినవాళ్ళు ఫోన్లు చేసి ఏంటి మీ పార్టీ ఇలా చేసింది అని అడుగుతున్నారంట. కొందరు ఇంకో అడుగు ముందుకేసి కమలం ఈకలు పీకి నోటిదూల తీర్చుకుంటున్నారంట. వీళ్ళకి ఏమి చెప్పాలో, ఎలా నిలవరించాలో అర్ధం గాక ఫోన్ వస్తుందంటేనే భయపడిపోతున్నారంట. కొందరు ఇంట్లోవాళ్ల చేత లేదా అసిస్టెంట్ల చేత అయ్యగారు బిజీ అని చెప్పిస్తున్నారట. కానీ జనం దగ్గరనుంచి ఇలా ఎంతకాలం తప్పించుకోగలరు?