ఆంధ్రాని ఊరిస్తున్న కేంద్రం..ఈ సారైనా ?

 ap hope central govt want giving special status

ప్రత్యేక హోదా లేక ప్యాకేజ్ ….ఇలా ఆశ పెట్టడం..ఊరించి ఉసూరనిపించడం కేంద్రానికి అలవాటైపోయింది..ఎదురు చూడటం ఆంధ్రాకి అలవాటైపోయింది. పార్లమెంట్ లో ఏపీకి చెందిన అన్ని పార్టీలవాళ్ళు డిమాండ్ చేసినపుడు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఓ వారంలోతీపి కబురు అన్నారు.జీఎస్టీ బిల్ పాస్ కాగానే టోన్ మారింది.మొత్తానికి మళ్లీ ఢిల్లీలో ఆంధ్రాకి చేయాల్సిన సాయం మీద చర్చలు ఊపందుకున్నాయి.

ఈ సారి కేంద్ర వర్గాల నుంచి నెల గడువు మాట వినిపిస్తోంది.పైగా ఈ దఫా రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై కూడా మోడీ సర్కార్ దృష్టి పెట్టిందన్న వార్తలు రావడం శుభసూచకం.కేంద్ర హోమ్ శాఖమంత్రి రాజనాథ్ సింగ్ ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడారు.ఆగష్టు 15 ప్రసంగంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పొరుగు రాష్ట్రాలు,కేంద్రంతో స్నేహ పూర్వక సంబంధాలు కొనసాగిస్తామని చెప్పడం చూస్తే ఢిల్లీ పెద్దలు కొన్ని ప్రయత్నాలు చేసినట్టే కనిపిస్తోంది.

ఇక ఆంధ్ర విషయానికి వస్తే రెండు వైపులనుంచి ఎవరు మెట్టు దిగి రావడం లేదు .హోదా ఇస్తే ఎప్పటినుంచో ఆ డిమాండ్ చేస్తున్న 11 రాష్ట్రాలు గొడవ చేస్తాయని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీవాదిస్తున్నారు .మా పరిస్థితి వేరు కాబట్టి వారితో పోల్చడం తగదని ఆంధ్ర అంటోంది.ఏమి జరిగినా హోదా డిమాండ్ ఆపేదిలేదని చంద్రబాబు ఢిల్లీ మీడియా ముందు కూడా గట్టిగానే చెప్తున్నారు.హోదానా? ప్యాకేజీ ? ఇలా అసలు విషయం మీదే ఏకాభిప్రాయం కుదరకుండా గడువులు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇది చూస్తుంటే అసలు విషయం మీద ఓ అభిప్రాయానికి వచ్చి …పైకి భిన్నవాదనలు వినిపిస్తున్నారా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి.విపక్షాలు కూడా అదే విమర్శలు చేస్తున్నాయి.కానీ ఈ సారి కేంద్ర వ్యవహారశైలి చూస్తుంటే ఆశించింది చేసినా చేయకపోయినా తాను చేయదల్చుకుంది చేసేలానే కనిపిస్తోంది.పార్టీలేమో గానీ ప్రజలు మాత్రం ఈ ఊరింపులు ఆపి కార్యాచరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు .

SHARE