ఏపీ లో రెడ్ల రూట్ మారుతోందా ?

 ap politics ysrcp reddies category root changed tdp

ఏపీలో రెడ్డి సామాజిక వర్గం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ వర్గం దూరమవుతోందా….?అంటూ ఔననే సమాధానమే వస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ గల్లంతైన తరుణంలో జగన్ పార్టీ రెడ్లకు పెద్ద దిక్కుగా కనిపించినా ఇప్పుడు ఆ పార్టీని వీడి వారు టిడిపిలో చేరుతున్నారు. రాయలసీమలో బలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాంతంలోని బలమైన రెడ్డి సామాజిక వర్గం టిడిపిలో చేరిపోయారు. కర్నూలుజిల్లాలో బలమైన రెడ్డి సామాజిక వర్గ నేతలుగా పేరున్న భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియ, ఎస్వీ మోహన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి అధికార టిడిపిలో తీర్ధం పుచ్చుకున్నారు.

అదే విధంగా కడపజిల్లాలో బలమైన రెడ్డి సామాజిక వర్గ నేత జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపి గూటికి చేరుకున్నారు. అదే విధంగా ప్రకాశం జిల్లాకు చెందిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, చిత్తూరుజిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి ఇలా రెడ్డి సామాజిక వర్గం నేతలు తమ పార్టీని వీడుతుండటం, కాంగ్రెస్ పార్టీలో ఇంకా మిగిలి ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలు టిడిపివైపే మొగ్గుచూపడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరుజిల్లాలో రాజకీయంగా శాసించే స్థాయిలో రెడ్డి సామాజికవర్గం తమ పార్టీ వైపు కాకుండా టిడిపి వైపు చూడటం తమకు కొంత నష్టమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పేర్కొంటున్నారు.

ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ, కమ్మ సామాజిక వర్గానికి టిడిపి అండదండలు ఉండేవి. కానీ వై.ఎస్.మరణానంతరం, ఆపై రాష్ట్ర విభజన అనంతరం రెడ్డి సామాజికవర్గానికి పెద్ద దిక్కుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనిపించేది. కానీ సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండేళ్లు దాటిన తరుణంలో ఏపిలోని రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా టిడిపి వైపు ఏపిలోని రెడ్డి సామాజిక వర్గం చూస్తోంది. అయితే రెడ్డి సామాజిక వర్గం ఎన్నడూ లేని విధంగా ఈ సారి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, వారికి రాజకీయంగా తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఇటీవల టిడిపి ఎంపీ జె.సి.దివాకర్‌రెడ్డి వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే.

ఇదే విషయాన్ని రాజకీయ వర్గాలు సైతం విశ్లేషిస్తున్నాయి. తమ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, తమపై నున్న వివిధ కేసుల దృష్ట్యా కూడా కొందరు రెడ్డి సామాజిక వర్గం నేతలు టిడిపి వైపు చూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పక్షం వైపు ఉండటమే తమ భవిష్యత్తుకు శ్రీరామ రక్ష అని రెడ్డి సామాజికవర్గం నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే రెడ్డి వర్గ నేతలు టిడిపిలోకి వలసవెళ్తున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇన్నాళ్లపాటు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నెల్లూరుజిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రాంనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి సైతం ఇటీవల టిడిపిలో చేరారు.

సార్వత్రిక ఎన్నికలకు ముందే తమకు పొసగని పార్టీ అయిన టిడిపిలో జె.సి.దివాకర్‌రెడ్డి బ్రదర్స్ చేరారు. ఇలా రెడ్డి సామాజిక వర్గ నేతలు భవిష్యత్తు అవసరాల రీత్యే టిడిపివైపు వలస వెళ్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏ పార్టీకి ఆ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అన్న దానిపై స్పష్టత వచ్చాకే మళ్లీ భవిష్యత్తు దృష్ట్యా ఏ పార్టీలో కొనసాగాలి అన్న దానిపై రెడ్డి సామాజికవర్గం నేతలు సమాలోచనలు చేసే అవకాశముందని ప్రచారం సాగుతోంది

SHARE