భారీగా AP పుష్కర ఏర్పాట్లు..

0
491

krishna-pushkaraalu

ఈ నెల 12 నుండి జరగనున్నకృష్ణా పుష్కరాల నిర్వహణకు ఏపీ సర్కారు భారీ కసరత్తే చేస్తోంది. తెలంగాణా రాష్ట్రం మీదుగా వచ్చే కృష్ణానది….గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్యగా పారుతూ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆంధ్రలోనే నగరాలు, పట్టణాలు ఉన్న నదీతీర ప్రాంతం ఎక్కువగా ఉండటం, కృష్ణా పుష్కరాలకు ప్రతిసారి విజయవాడ ప్రత్యేక ఆకర్షణగా నిలవటంతో…. ఈ సారి కూడా విజయవాడను కేంద్రంగా చేసుకుని రెండు జిల్లాలలో భారీగా పుష్కర ఏర్పాట్లు చేస్తున్నారు.

కృష్ణాజిల్లాలో మెత్తం 74 ఘాట్లు, గుంటూరు జిల్లాలో 77 ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఘాట్లను ‘ఏ’ ‘బీ’ ‘సీ’ కేటగిరీలుగా విభజించారు. లక్షమందికి పైగా భక్తులు రోజూ స్నానమాచరించే ఘాట్లను‘ఏ’ కేటగిరిగా, 50 వేల మందికి పైగా వచ్చే అవకాశమున్న వాటిని ‘బీ’గా, 10 వేలకు పైగా వచ్చే ఘాట్లను ‘సీ’ కేటగిరిగా విభజించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి కాకుండా లోకల్ ఘాట్లను సైతం రెడీ చేస్తున్నారు. విజయవాడ నగరంలోనే ఆరు ఘాట్లు ఉండగా, గుంటూరు జిల్లాలో అమరావతి ,ఉండవల్లి, తాడేపల్లి ఘాట్లను కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజికి రెండువైపులా భారీ ఘాట్లు రెడీ అవుతున్నాయి. దుర్గా ఘాట్, పున్నమి ఘాట్, భవానీ ఘాట్, కృష్ణ వేణి ఘట్, పద్మావతి ఘాట్, విజయ కృష్ణా ఘాట్లను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుని రెడీ చేస్తోంది. సీఎం నుండి మొదలుకుని మంత్రులు, అధికారులు పుష్కర ఏర్పాట్లను నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

పుష్కరాలకు చెందిన అన్ని ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా కృష్ణా గోదావరి నదుల పవిత్ర సంగమం దగ్గర చేయబోతోంది. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు వచ్చి కృష్ణా జలాలలతో కలవడంతో మొదటిసారి రెండునదుల సంగమ ప్రదేశం ఏర్పడింది. అందుకే ఈ సంగమ స్థలం దగ్గర ఒక ఘాట్ ను ప్రత్యేకించి రెడీ చేస్తున్నారు. అక్కడే పుష్కర నగర్ ను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర్లంలోని ప్రముఖ దేవాలయాల నమూన ఆలయాలను సైతం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ రోజు సాయంత్రం ఇచ్చే పుష్కర హారతిని ఇక్కడనుంచే ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

12 రోజుల పాటు నిర్విరామంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నారు.అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసి ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేస్తున్నారు. సెక్యూరిటీ, ఎమెర్జెన్సీ ట్రీట్ మెంట్, ఎరేంజ్ మెంట్స్, SOS టీమ్ లను తయారుచేస్తున్నారు. ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతుండగా, మెడికల్ డిపార్టుమెంటువాళ్ళు ప్రతి ఘాట్ వద్ద మొబైల్ హాస్పటల్ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోలీస్ శాఖ పూర్తిస్థాయి సిబ్బందిని ఈ పుష్కరాలపై వినియోగించనుంది. స్పెషల్ టీంలు, ట్రాఫిక్ రెగ్యులరేషన్ తో పాటు, సీసీ కెమెరా నిఘా, డ్రోన్ కెమెరాల నిఘా వంటి చర్యలు చేపట్టనున్నారు.

కృష్ణవేణి ఘాట్ విజయవాడలో ఏర్పాటుచేసిన అత్యంత పొడవైన ఘాట్. కృష్ణా బ్యారేజి దిగువ ప్రాంతం నుండి రైలు బ్రిడ్జి దాకా సుమారు కిలోమీటరున్నర పొడవు ఉన్న అతి పెద్ద ఘాట్. కొన్ని లక్షల జనాభా నిత్యస్నానాలు చేసే ఈ ఘాట్ కు రధ్దీ ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు.అమ్మవారి పాదాల చెంత ఉన్న దుర్గా ఘాట్ ఇది. ఒక వైపు దుర్గమ్మ గుడి మరో వైపు కృష్ణమ్మ ఒడి….ఈ రెండింటి మధ్యలో ఈ ఘాట్ ఉంటుంది. కృష్ణా నదిలో పుణ్యస్నానం ఆచరించి ఇంద్రకీలాద్రి పై ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ పుష్కర స్నానాల చేసేందుకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, అమ్మవారి దర్శనానికి వెళ్ళటానికి సులువైన మార్గం కూడా ఇదే. అలాగే, అన్ని రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్న ప్రదేశం.

పున్నమి ఘాట్ ను కట్టుదిట్టమైన భద్రతతో నిర్మిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తులు పుష్కర స్నానమాచరించే ఘాట్ ఇదే. 2004 పుష్కరాలలో కూడా ఇదే వీఐపీ ఘాట్. పక్కనే భవానీ ఐలాండ్ కూడా ఉంది. ఈ ఘాట్ కు రావటానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి మరొకటి ప్రకాశం బ్యారేజి నుండి. ఇది టూరిస్ట్ ఎట్రాక్షన్ ఉన్న ఘాట్ కావటంవల్ల దీన్ని ప్రభుత్వం చాలా అందంగా తీర్చిదిద్దుతోంది.

ఇక పద్మావతి ఘాట్ బస్ స్టేషన్ కి అతి దగ్గర్లో ఉండటంతో భక్తులు ఎక్కువగా ఈ ఘాట్ నే ఉపయోగించే అవకాశం ఉంది. ఇక్కడికి రవాణా సదుపాయాలు కూడా ఎక్కువ. ఇటు గుంటూరు,నెల్లూరు,ప్రకాశం జిల్లాల నుండి వచ్చే భక్తులకు అతి సమీపంలో ఉన్న పుష్కర ఘాట్ ఇదే.గుంటూరు జిల్లాలో సీతానగరం, ఉండవల్లి, అమరావతి ఘాట్ లను ప్రభుత్వం రెడీ చేయిస్తోంది.

Leave a Reply