Posted [relativedate]
గతంలో ప్రభుత్వాలు భూములు సేకరించాలంటే పెద్ద ప్రహసనంగా ఉండేది. రైతుల ఆందోళన, శాపనార్థాలు, లాఠీఛార్జీలు, కోర్టు కేసులతో ఎప్పటికీ సమస్యలు పరిష్కారం అయ్యేవి కాదు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి . కానీ రాజధాని కోసం 33వేల ఎకరాలు భూసమీకరణ ద్వారా తీసుకున్న ఏపీ.. ఎక్కడా చిన్న వ్యతిరేకత రాకుండా అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో స్వయంగా కేంద్రం కూడా ఆశ్చర్యపోయి భూసమీకరణ విధానాన్ని స్టడీ చేయించి నివ్వెరపోయింది. ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని పలు రాష్ట్రాలకు సూచించింది.
సరే అదంటే భూసమీకరణ కదా అంటారా. ఎప్పట్నుంచో ఉన్న భూసేకరణ విషయంలోనూ ఏపీ సర్కారు రికార్డులు సరిచేస్తోంది. పోలవరం కుడికాలువకు వైఎస్ హయాంలో ఇచ్చిన పరిహారంతో పోలిస్తే.. ఇప్పుడదే ప్రాజెక్టు నిర్వాసితులకు చంద్రబాబు సర్కారు ఇస్తున్న పరిహారం చూసి.. అన్నదాతలే ముందుకొచ్చి భూములిస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణ, అటవీ భూముల సేకరణ ఇలా ఎక్కడ చూసినా రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ప్రభుత్వం ఉదారంగా పరిహారం ఇవ్వడమే దీనికి కారణం.
ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వమూ రైతుల పట్ల ఇంత ఉదారంగా వ్యవహరించలేదని ఏపీ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. చంద్రబాబు ఏమైనా అనుకుంటే ఎంత బాగా చేస్తారో.. ఈ వ్యవహారమే నిదర్శనమంటున్నారు. చంద్రబాబు పుణ్యమా అని ఇప్పటికే తుళ్లూరు రైతులు కోటీశ్వరులయ్యారు. ఎప్పుడూ కారు ముఖం చూడని వారు కూడా ఇప్పుడు బెంజ్ కార్లలో తిరుగుతున్నారు. అదే విధంగా సమీకరణకు భూములిచ్చినవాళ్లు.. సంవత్సరం సంవత్సరం ఠంచనుగా కౌలు అందుకుంటున్నారు. ఇప్పుడు సేకరణలో కూడా ప్రభుత్వం ఉదారంగా పరిహారం ఇచ్చి రైతుల జీవన స్థితిగతుల్ని పెంచే ప్రయత్నం చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.