Posted [relativedate]
ఏపీ క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న అయ్యన్న.. అనుభవం లేని లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వడంపై వస్తున్న విమర్శల్ని కొట్టిపారేస్తున్నారు. అవసరమైతే తమలాంటి సీనియర్లు ఆయనకు అండగా ఉంటామన్నారు. లోకేష్ ఇప్పటికే పార్టీలో తనను తాను నిరూపించుకున్నారని, ఆయనకు అన్ని శాఖలపై సరైన అవగాహన ఉందని చెబుతున్నారు. తన దగ్గరున్న పంచాయతీ రాజ్ శాఖను లోకేష్ కు వదులుకున్న అయ్యన్న.. కీలకమైన ఆర్ అండ్ బీ శాఖను చేజిక్కించుకున్నారు. ఇప్పటికే అయ్యన్నపాత్రుడికి లోకేష్ దగ్గర మంచి ర్యాపో ఉందనేది టీడీపీ వర్గాల మాట.
అయ్యన్న కుమారుడు విజయ్ పాత్రుడు.. లోకేష్ టీమ్ లో కీలక సభ్యుడు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వీళ్లిద్దరూ కలిసి ఉత్తరాంధ్రలో పార్టీ గెలుపు కోసం గేమ్ ప్లాన్ తయారుచేశారనేది టీడీపీ కార్యకర్తల మాట. ఇప్పుడు అయ్యన్నపాత్రుడు కూడా లోకేష్ తో తరచుగా మంతనాలు జరుపుతున్నారని, ఆయనకు చినబాబు టీమ్ లో కీలక స్థానం ఉందని చెబుతున్నారు. అదే నిజమైతే విశాఖ జిల్లా రాజకీయాల్లో అయ్యన్నపాత్రుడు మరోసారి చక్రం తిప్పుతారని కూడా అంచనాలున్నాయి.
నిజానికి అయ్యన్నపాత్రుడికి మచ్చలేని నేతగా పేరుంది. ఎన్టీఆర్ హయాం నుంచి కీలక మంత్రి పదవులు దక్కించుకున్న అయ్యన్నపాత్రుడు మొదట్నుంచీ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. కష్టకాలంలో కూడా అండగా నిలబడ్డారు. క్లీన్ ఇమేజ్, కార్యకర్తల్లో మంచి పేరు అయ్యన్నకు కలిసివచ్చే అంశాలు. జిల్లా టీడీపీ క్యాడర్ అందరితో అయ్యన్నకు ఉన్న సత్సంబంధాలు మిషన్ -2019 కి కీలకమౌతాయని లోకేష్ కూడా భావిస్తున్నారట. అందుకే అయ్యన్న సలహాలు తీసుకోవడానికి వెనుకాడరనేది టీడీపీ వర్గాల అభిప్రాయం.