బాబు ,కేసీఆర్ లకు మోడీ మార్క్ స్ట్రోక్ …

0
637

babu kcr modi
తెలుగు రాష్ట్రాలకు మోడీ స్ట్రోక్ మీద స్ట్రోక్ ఇస్తూనే వున్నారు. ఒకే దెబ్బతో ఇప్పుడు బాబు ,కేసీఆర్ లను కంగు తినిపించారు. అదిగదిగో నియోజకవర్గాల పెంపు అని చెప్తూ ప్రత్యర్థి పార్టీ నేతలకు తలుపులు బార్లా తెరిచిన ఇద్దరు సీఎంలకు దిమ్మతిరిగే స్ట్రోక్ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని కేంద్రం రాజ్యసభ వేదికగా తేల్చి చెప్పింది .టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్ అడిగిన ప్రశ్నకు హోమ్ శాఖ సహాయ మంత్రి గంగారాం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్లు పెంచాలని కేంద్రంపై రెండు రాష్ట్రాలు ఒత్తిడి తెస్తున్నాయి .కానీ నియోజకవర్గాల పునర్విభజన 2026 లో జరగాల్సి వుంది.దీంతో కేంద్రం అటార్నీజనరల్ ను వివరణ కోరింది .రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ముందుగా తెలుగురాష్ట్రాల్లో నియోజక వర్గాల పెంపు సాధ్యం కాదని అయన చెప్పడంతో కేంద్రం తాజా నిర్ణయాన్ని ప్రకటించింది .

కేంద్రం తల్చుకుంటే రాజ్యాంగసవరణ సాధ్యంకాదా ?అదే నిజమైతే విభజన చట్టంలో ఈ అంశాన్ని ఎలా పొందుపరిచారు ? ఇవేమి ఆలోచించకుండా అసలా విషయాన్నే పక్కన పెట్టడం వెనుక రాజకీయ కోణం లేకపోలేదు .తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా తన బలం పెంచుకోవాలని బీజేపీ చేయని ప్రయత్నం లేదు .ఫలితం సున్నా .అధికార పక్షాల మీద ఎంత వ్యతిరేకత వున్నా ప్రతిపక్షాలు బలపడకుండా ఇద్దరు సీఎంలు చక్రం తిప్పుతున్నారు .ప్రత్యర్థి పార్టీల నేతల్నిఆకర్షించి వారిని గుక్క తిప్పుకోకుండా చేస్తున్నారు.

ప్రతిపక్షాలు బలహీనపడితే తాము ఆ స్థానంలోకి రావచ్చని బీజేపీ ఆశపడింది .ఈ ప్రమాదాన్ని ఊహించే ముఖ్యమంత్రులు చాపకింద నీరులా ఆ పార్టీ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు .కేంద్రం ఏమాత్రామూ ఆంధ్రకు సహకరించడం లేదన్న వాదనను బాబు బలంగా జనాల్లోకి తీసుకెళ్లారు .కేంద్ర వైఖరి కూడా అందుకు దోహదపడింది.ఒక ప్రజాకర్షక నేత దొరికితే ఆంధ్రాలో ఒంటరిగా కమలం జెండా ఎత్తాలని కొందరు నేతలు ఉబలాటపడ్డారు .రాను రాను పరిస్థితులు గమనించి మౌన ముద్ర వహిస్తున్నారు .కేంద్రం రాష్ట్రానికి ఏదైనా చేస్తే ఆ అండతో చెలరేగుదామనుకున్న నేతలు…అందుకు హైకమాండ్ ని ఒప్పించలేక …హైకమాండ్ చెప్పినట్టు పార్టీని బలోపేతం చేయలేక ఊరుకున్నారు .వివిధ పార్టీల్లో అసమ్మతి నేతల్ని ఆకర్షించడానికి వెళితే ఎవరు ఆసక్తి చూపలేదంట.పైగా మేత వెయ్యకుండా పాలు ఎలా వస్తాయని ప్రశ్నించారట .తెలంగాణలోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదు.కేసీఆర్ ఓ వైపు మజ్లీస్ ను దువ్వుతున్నారు .మరోవైపు కేంద్రంతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు .తెలంగాణా సమాజం బలంగా విశ్వసిస్తున్న కేసీఆర్ తీరును స్థానిక కమలం నేతలు ఒడిసిపట్టలేకపోతున్నారు .

ఈ పరిస్థితుల్లో మోడీ,అమిత్ షా ముందుగా ఇద్దరు సీఎంలను కట్టడి చేయాలని నిర్ణయించుకుని ఉండొచ్చు.కొత్త సీట్లులేవని తెలిశాక ఆకర్ష్ కి బ్రేక్ పడుద్దని భావించి ఉండొచ్చు.రాజకీయ ఆట ఆగితే గానీ పాలనాపరమైన వైఫల్యాలు బయటపడవని  మోడీ ప్లాన్ కావొచ్చు .అందుకే ఈ స్ట్రోక్ ఇచ్చి ఉండొచ్చు.కానీ అదంత తేలిక కాకపోవచ్చు.రణక్షేత్రంలో ఎదురుగా వున్నది ఆరితేరిన ఆటగాళ్లు ఒకరు బాబు..మరొకరు కేసీఆర్…ఇప్పటికే జనం కష్టాల పాపాన్నంతా కేంద్రం అకౌంట్  లో వేసిన రాజకీయ ధురంధరులు …మొత్తానికి సమఉజ్జీల మధ్య పసందైన పోరు మొదలయింది ..మోడీ స్ట్రోక్ కి బాబు,కేసీఆర్ కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి .

*కిరణ్ కుమార్

Leave a Reply