Posted [relativedate]
దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ‘బాహుబలి 2’ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయం తెలుసుకునేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు ‘బాహుబలి 2’ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇతర దేశాల్లో ఉన్న ఇండియన్ సినీ ప్రేక్షకులు కూడా ‘బాహుబలి 2’ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వారు వారి వారి టికెట్స్‌ను బుక్ కూడా చేసుకున్నారు. ఇప్పటి వరకు ఒక ఇండియన్ సినిమా అమెరికాలో విడుదల కాని స్థాయిలో ‘బాహుబలి 2’ చిత్రం విడుదల కాబోతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ వర్షన్లలో ఏకంగా 1050 థియేటర్లలో విడుదలకు సిద్దం అయ్యింది. ఈ 1050 థియేటర్లలో ప్రీమియర్ షో టికెట్లు బుక్ అయ్యాయి.
విడుదలకు ఇంకా రెండు వారాల సమయం ఉన్న నేపథ్యంలో బుకింగ్ భారీగా ఉంటే మరో 100 నుండి 150 స్క్రీన్స్‌ను పెంచే అవకాశాలున్నాయి. గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓవర్సీస్లోనే ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్‌కు పైగా వసూళ్లు చేసేలా ఉంది. మూడు భాషల్లో కలిపి అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్న నేపథ్యంలో అందరి దృష్టి బాహుబలి మొదటి రోజు ఓవర్సీస్ కలెక్షన్స్‌పై పడుతుంది. బాలీవుడ్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసేలా ‘బాహుబలి 2’ కలెక్షన్స్ ఉండబోతున్నట్లుగా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మరియు దేశ వ్యాప్తంగా కూడా భారీ నుండి అతి భారీ స్థాయిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.