ఓ మనిషి కన్నా ఆయన ఆలోచనల ప్రభావం ఎక్కువ.అందుకే ఈ ప్రపంచంలో ఉత్పత్తులు గుర్తున్నంతగా వాటి ఉత్పత్తిదారులు గుర్తుండరు.అది క్రియేటివ్ రంగం అయితే ఈ సమస్య మరీ ఎక్కువ.రామాయణ,మహాభారతాలు గుర్తున్నంతగా వాల్మీకి,వ్యాసులు గుర్తుంటారా? ప్రపంచ ప్రసిద్ధ మోనాలిసా చిత్ర పటం గుర్తున్నంతగా అది గీసిన లియోనార్డ్ డా విన్సీ గుర్తుంటాడా? కష్టమే .కానీ అప్పట్లో ఈ అద్భుతాలు సృష్టించినవాళ్ళకి అదో వ్యాపకమే గానీ పూర్తి స్థాయి వృత్తి లేదా వ్యాపారం కాదు.పైగా దీని తర్వాత ఇంకోటి,అపి ఒకటి చేయాలన్న ఒత్తిడి గానీ సామాజిక ఒత్తిడిగానీ లేవు. అప్పుడు లేని ఈ ఇబ్బందులన్నీ ఇప్పటి ఈ వినిమయ ప్రపంచంలోకి వచ్చి పడేశాయి.వీటి మధ్య బాహుబలి ఇప్పటికే వెయ్యి కోట్ల వసూళ్లు దాటేసి కమర్షియల్ ప్రపంచంలో ఎంతో ఎత్తుకి వెళ్ళిపోయాడు.భారతీయ సినిమా ఉద్దానానికి నిలువెత్తు నిదర్శనంగా మారాడు బాహుబలి.
ఈ పరిణామాలు ఇప్పుడు రాజమౌళికి భారంగా మారాయి.రాజమౌళిని ఇప్పుడు బాహుబలి మింగేశాడు.ఆయన కొత్త సినిమా గురించి ఏ ఆలోచన చేసినా తొలి అడుగు అక్కడనుంచే పడుతుంది.బాహుబలి ప్రభావం ఆ ఆలోచనల్ని చిందరవందర చేయొచ్చు.అందుకే కొత్త సినిమా ఎంపిక,షూటింగ్ ఇప్పుడు రాజమౌళికి అంత తేలిగ్గాదు.దాన్ని హిట్ చేయడం అంతకుమించిన పని అవుతుంది.ఓ గొప్ప విజయం కూడా కొన్ని సమస్యలు మోసుకొస్తుందంటే ఎవరూ నమ్మరు.కానీ ఇప్పుడు రాజమౌళిని మించిన బాహుబలి అందుకు నిలువెత్తు సాక్ష్యంలా కనిపిస్తున్నాడు.