Posted [relativedate]
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పుడు ఎవరు చూసినా బాహుబలి గురించి మాట్లాడుకుంటున్నారు. బాహుబలి అంటే రాజమౌళి బాహుబలి కాదు. మరో బాహుబలి. ఆ కథ ఏంటో ఓ సారి చూద్దాం.
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి… కేసీఆర్ ను ఓడించడానికి బాహుబలి రాబోతున్నాడు అని తాజాగా వ్యాఖ్యానించారు. ఆ బాహుబలి ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొందరేమో ఆ బాహుబలి రాహుల్ గాంధీ అని చెబుతుంటే.. మరికొందరేమో తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త సారథి రాబోతున్నాడని అంటున్నారు. ఆ కొత్త సారథి ఎవరో జానారెడ్డికి తెలుసట. అందుకే బాహుబలి వస్తాడంటూ ఆయన చెప్పారట.
కాంగ్రెస్ లోని మరొక వర్గం ఏమో బాహుబలి కొత్తగా రావడమేంటి…? ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు బాహుబలి రూపంలో ఉన్నారని అంటున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారైతే … కేసీఆర్ ను ఓడించడానికి బాహుబలి కాదు… బాహుబలులు సిద్ధంగా ఉన్నారని పరాచికాలాడుతున్నారు.
ఇక డీకే అరుణ లాంటి వారైతే… బాహుబలి సంగతేంటో కానీ… కట్టప్ప మాత్రం కేసీఆర్ అని విమర్శిస్తున్నారు. ఆయన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచాడని… కాబట్టి ఆయన కట్టప్పేనని ఆమె మండిపడుతున్నారు.
అటు ఈ బాహుబలి చర్చలో బీజేపీ నేత కిషన్ రెడ్డి కూడా ఎంటరయ్యారు. ఆ వచ్చే బాహుబలి కచ్చితంగా బీజేపీ నుంచేనని చెబుతున్నారు. అమిత్ షాయే బాహుబలి అట. ఆయన వచ్చే నెలలో రాబోతున్నారని.. ఇక కేసీఆర్ కు కష్టకాలమేనని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా బాహుబలి గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకూ కేసీఆర్ ను ఓడించడానికి రాబోతున్న ఆ బాహుబలి ఎవరంటూ తెగ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బలీయమైన శక్తిగా ఎదిగిన కేసీఆర్ ను ఓడించే దమ్మున్న ఆ బాహుబలి ఎవరో మరి!!! ఇప్పుడు ఎక్కడున్నాడో? ఏం చేస్తున్నాడో?