రేపే బాహుబలి సెకండ్ రిలీజ్ ..రిజల్ట్?

Posted April 6, 2017

bahubali movie re release on april 7
బాహుబలి సినిమా వల్ల పాత రికార్డులన్నీ బద్ధలవుతున్నాయి.దాంతో పాటు సినిమా రంగంలో ఇక చరిత్రగా మిగిలిపోయే కొన్ని విషయాలు కూడా మళ్లీ సరికొత్తగా సీన్ లోకి వస్తున్నాయి.ఒకప్పుడు మాయాబజార్,లవకుశ,దేవదాసు,అల్లూరి సీతారామరాజు వంటి సినిమాలు సెకండ్ రిలీజ్,థర్డ్ రిలీజ్ అంటూ పదేపదే ప్రేక్షకుల్ని పలకరించేవి.ఎన్నిసార్లు విడుదలైనా వాటికి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టేవాళ్ళు.ఇన్ని సార్లు రిలీజ్ అంటూ నిర్మాతలు దాన్ని ఆ సినిమా విజయానికి సూచికగా ,గొప్పగా చెప్పుకునే వాళ్ళు కూడా.కానీ కాలక్రమంలో టీవీ వచ్చింది.పాత చిత్రాలు కొత్తగా రిలీజ్ చేసే సంప్రదాయానికి తెర పడింది.కానీ ఇప్పుడు బాహుబలి ఆ పాత ట్రెండ్ కి సరికొత్తగా శ్రీకారం చుట్టింది.

బాహుబలి ది బిగినింగ్ రేపు దేశవ్యాప్తంగా 1000 కి పైగా థియేటర్ లలో విడుదల అవుతోంది. దీనికి కారణం మాత్రం ఏప్రిల్ 28 న రిలీజ్ అవుతున్న బాహుబలి సెకండ్ పార్ట్.ఆ సినిమాని బాగా అర్ధం చేసుకుని ఎంజాయ్ చేయాలంటే …తొలి భాగాన్ని ఇప్పుడు చూస్తే బాగుంటుందని ప్రేక్షకులకి చెప్పకుండా చెప్పటమే.దీని వల్ల కొద్దిపాటి కలెక్షన్స్ తో పాటు బాహుబలి పార్ట్ 2 కి భారీ పబ్లిసిటీ వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.అయితే ఇప్పటికే టీవీల్లో ఎన్నోసార్లు ఈ సినిమా చూసిన జనాలు ఇప్పుడు కొత్తగా థియేటర్ కి వెళ్లి చూస్తారా ? ఏమైనా బాహుబలి సినిమా పరంగానే కాకుండా మార్కెటింగ్ పరంగాను సరికొత్త ఎత్తులతో ముందుకెళుతోంది.చివరికి రిజల్ట్ ఏమవుతుందో…

SHARE