పీఏ శేఖర్ పై బాలయ్య వేటు!!

Posted February 7, 2017

balkrishna pa job voosting
అనుకున్నదే జరిగింది. హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి నటసింహం బాలయ్య.. పీఏ శేఖర్ పై వేటు వేశారు. విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇంటికి వెళ్లిపోవాలని గట్టిగా చెప్పేశారు.

నిజానికి పీఏ శేఖర్ పై అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారట బాలయ్య. శేఖర్ పై వచ్చిన ఆరోపణలన్నింటిపైనా ఆరా తీశారని టాక్. అందులో శేఖరుడు చేసిన అవినీతి పనుల చిట్టా అంతా బయట పడిందన్న వార్తలొస్తున్నాయి. లక్ష రూపాయల పనికి పీఏ గారు పది వేల లంచం తీసుకున్నారట. కాంట్రాక్టర్ ఎవరైనా ముక్కుపిండి వసూలు చేసినట్టు తేలింది. అంతేకాదు తనకు వ్యతిరేకంగా గళమెత్తితే చాలు.. అలాంటి టీడీపీ నేతలను సస్పెండ్ చేసినట్టు కూడా సమాచారం. షాడో ఎమ్మెల్యేగా బాలయ్య బాబు ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసినట్టు స్పష్టంగా నిర్థారణ అయ్యిందని తెలుస్తోంది.

పీఏగా ఉండాల్సిన వ్యక్తి రాజకీయాలు చేయడం బాలయ్య దృష్టికి వచ్చింది. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అతను … రాజకీయ నాయకులకు ఏమాత్రం తీసిపోని విధంగా పావులు కదిపారు. తనకు అనుకూలంగా ర్యాలీలు చేయించారు. ఇవన్నీ బాలయ్య దృష్టికి వచ్చాయి. ఇక ఆలస్యం చేస్తే… మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. శేఖర్ పై వేటు పడింది.

నిజానికి పీఏ శేఖర్ ను తీసేయాలని బాలయ్య బాబు చాలా కాలంగా ఆలోచిస్తున్నారట. అప్పట్లోనే పీఏ చేసిన తప్పులు చేసినట్టు ఆయన దృష్టికి వచ్చాయట. అయితే కొందరు పార్టీ నేతలు ఇంకో ఛాన్స్ ఇవ్వాలని బాలకృష్ణను కోరారట. దీంతో మరో అవకాశం ఇచ్చారట. ఇంత సమయం ఇచ్చినా పద్ధతి మార్చుకోకపోవడం… రాజకీయాలు చేయడం… ఈ పరిణామాలతో బాలకృష్ణ చాలా సీరియస్ అయ్యారట. అందుకే అతన్ని విధుల నుంచి తొలగించారని సమాచారం. అయితే శేఖర్ పై వేటుతో ఇప్పుడు హిందూపురం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య మంచి నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

SHARE