Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్.. అతని స్నేహితుడు రవిచంద్ర రోడ్డు యాక్సిడెంట్లో మరణించటం తెలిసిందే. వాయువేగంతో నడిపిన కారును జూబ్లీహిల్స్ లోని మెట్రో ఫిల్లర్ 36ను ఢీ కొనటంతో సంఘటనాస్థలంలోనే వీరిద్దరూ మరణించారు. అత్యంత ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారులో ప్రయాణిస్తున్నప్పటికీ.. రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పటికీ ప్రమాదంలో ఇరువురు మరణించటం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఉదంతంపై బెంజ్ కంపెనీకి హైదరాబాద్ పోలీసులు లేఖ రాశారు. కారులో అత్యాధునిక ఫీచర్లు ఉన్నప్పటికీ ప్రాణాలు కోల్పోవటానికి కారణాలు ఏమిటో వివరించాల్సిందిగా బెంజ్ కంపెనీని పోలీసులు కోరారు. దీంతో.. జర్మనీ నుంచి ప్రత్యేక వాహన నిపుణుల్ని బెంజ్ పంపింది. ఇరువురు ప్రతినిధులు జర్మనీ నుంచి హైదరాబాద్కు వచ్చారు. బుధవారం నగరానికి చేరుకున్న వారు.. గురువారం ప్రమాదం జరిగిన మెట్రో ఫిల్లర్ 36 వద్దకు వెళ్లారు.
ప్రమాదం జరిగిన వివరాల్ని అడిగి తెలుసుకున్న వారు.. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికీ ప్రాణనష్టం ఎలా జరిగిందన్న కోణంలో విచారిస్తున్నారు. ప్రమాదానికి గురైన నిషిత్ కారు ప్రస్తుతం బోయిన్ పల్లి బెంజ్ సర్వీస్ సెంటర్ లో ఉంది. ఈ కారును పరిశీలించిన అనంతరం మొత్తం వ్యవహారంపై బెంజ్ ప్రతినిధులు తమ నివేదికను ఇవ్వనున్నారు.