Posted [relativedate]
తెలంగాణ సీఎం కేసీఆర్ సన్నిహితుడు, మై హోమ్స్ ఎండీ జూపల్లి రామేశ్వరరావు ఆధ్మాత్మిక చింతన ఎక్కువ. పారిశ్రామిక వేత్తగా ఆయన ఎంత సక్సెస్ అయ్యారో…ఆధ్యాత్మిక వేత్తగానూ ఆయనకు మంచిపేరే ఉంది. చిన్నజీయర్ స్వామికి ఆయన ఎంతో ప్రీతిపాత్రుడు. ఆధ్మాత్మిక కార్యక్రమాలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. అందుకే సీఎం కేసీఆర్ కూడా అందుకు తగ్గట్టుగా ఆయనకు కీలక బాధ్యతలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని టాక్.
మంచి ప్లానింగ్ తో అందరినీ ఆకట్టుకుంటున్న యాదాద్రి తరహాలో భద్రాద్రిని కూడా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారట. అయితే యాదాద్రిలా భద్రాద్రి హైదరాబాద్ కు దగ్గర్లో లేదు. తరచుగా వెళ్లి పనులను పర్యవేక్షించడం కష్టం. కాబట్టి ఆ బాధ్యతలను జూపల్లి రామేశ్వరరావుకు అప్పగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని టాక్.
జూపల్లి రామేశ్వరరావుకు ఆ బాధ్యతలు అప్పగిస్తే.. ఆయన తరచూ అక్కడికి వెళ్లి పరిశీలిస్తారు. హెలికాప్టర్ లో ఇలా వెళ్లి అలా వచ్చే అవకాశముంది. అందుకుగాను జూపల్లికి ఆర్థికంగానూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా అయితే ఆయన ప్రభుత్వ సాయానికి తోడుగా తన సొంత ఖర్చులను కూడా రాములోరి కోసం వెచ్చించే అవకాశముంది. ఇవన్నీ పక్కనబెడితే రామేశ్వరరావు రామ భక్తుడు. ఈ బాధ్యతను అప్పగిస్తే ఆయన చాలా సంతోషంగా స్వీకరించే అవకాశముంది. ఆ దిశగా ఇప్పటికే చర్చలు జరిగాయట. జూపల్లి రామేశ్వరరావు కూడా అందుకు ఓకే చెప్పారని సమాచారం. అందులో భాగంగానే జూపల్లి రామేశ్వరరావు, చిన్నజీయర్ స్వామి ఇటీవల హెలికాప్టర్ లో భద్రాద్రికి వెళ్లివచ్చారని ప్రచారం జరుగుతోంది.
గడిచిన నాలుగేళ్లుగా భద్రాద్రి సీతారామ చంద్రస్వామి ఆలయ పాలకమండలి లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా.. ఇప్పటికి ఆ ఖాళీని భర్తీ చేయలేదు. ఇప్పుడు మైహోం రామేశ్వరరావుకు ఈ పగ్గాలు అప్పగిస్తే దేవాలయ రూపురేఖలు మార్చేయటంతో పాటు.. ఆలయాన్ని ఆయన భారీగా ప్రమోట్ చేయడం ఖాయం. అటు భద్రాద్రికి చెందిన నాయకులు కూడా రామేశ్వరరావుకు ఆ పదవి అప్పగించడంపై చాలా సానుకూలంగా ఉన్నారు. ఇలాంటి బలమైన వ్యక్తి రావడం రాములోరి దేవస్థానం అభివృద్ధికి ఎంతగానే తోడ్పడుతుందని ఆశిస్తున్నారు.