భూమా ఇకలేరు!!

138

Posted [relativedate]

bhuma nagireddy dead
టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి క‌న్నుమూశారు. తీవ్ర‌మైన గుండెపోటు రావ‌డంతో ఆయ‌నను ఆస్ప‌త్రిలో చేర్పించారు. నాగిరెడ్డిని కాపాడ‌డానికి డాక్ట‌ర్లు విఫ‌ల‌య‌త్నం చేశారు. అయినా లాభం లేక‌పోయింది. చికిత్స అందుతుండ‌గానే ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఇక సెల‌వంటూ తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు. భూమా మృతికి సీఎం చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ సంతాపం తెలిపారు.

ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు మారుపేరైన రాయ‌ల‌సీమ‌లో బ‌ల‌మైన రాజ‌కీయ నాయ‌కుడు భూమా నాగిరెడ్డి. మూడు ద‌శాబ్దాల ఆయ‌న రాజ‌కీయ జీవితంలో క‌ర్నూలు జిల్లాపై చెర‌గ‌ని ముద్ర వేశారు. టీడీపీ నుంచి ఆయ‌న రాజకీయ ప్ర‌స్థానం మొద‌లైంది. 1987 లో పాలిటిక్స్ లో అడుగుపెట్టారాయ‌న‌. మొద‌ట స్థానిక ఎంపీపీగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. అనంత‌రం ఎంపీగా పోటీచేశారు. మూడుసార్లు నంద్యాల ఎంపీగా పోటీచేసి విజ‌యం సాధించారు. తాను ఎంపీగా ఉంటూనే త‌న భార్య శోభా నాగిరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆమె ఎమ్మెల్యేగా… ఈయ‌న ఎంపీగా చ‌క్రం తిప్పారు.

1990 ద‌శకంలో విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి హ‌వా న‌డుస్తున్న క‌ర్నూలు జిల్లాలో కాంగ్రెస్ కు ధీటుగా టీడీపీ త‌యారు చేయ‌డంలో భూమాదే కీల‌క‌పాత్ర‌. ఒక‌ర‌కంగా చెప్పాలంటే కోట్ల కుటుంబానికి కంచుకోట‌గా ఉన్న క‌ర్నూలు జిల్లాను ఆయ‌న బ‌ద్ద‌లు కొట్టారు. ఆ క్ర‌మంలోనే ఎన్టీఆర్, చంద్ర‌బాబుకు ద‌గ్గ‌ర‌య్యారు. జిల్లాలో టీడీపీ ఒక బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తిగా ఎదిగింది. 2004 త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో భూమా కుటుంబానికి ఓట‌మి ఎదురైంది. ఓట‌మి త‌ర్వాత టీడీపీకి ఈ ఫ్యామిలీ దూర‌మైంది. 2009లో భూమా కుటుంబం ప్ర‌జారాజ్యం త‌ర‌పున పోటీ చేసింది. భూమా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన‌ప్ప‌టికీ… శోభ‌మ్మ ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో భూమా కుటుంబం ఉనికిని చాటుకుంది. ఆ త‌ర్వాత ఈ పొలిటిక‌ల్ క‌పుల్ వైసీపీ గూటికి చేరుకున్నారు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పునే భూమానాగిరెడ్డి దంప‌తులు పోటీ చేశారు. అయితే యాక్సిడెంట్ లో శోభ మృతి చెందారు. భూమా నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. శోభ మృతి త‌ర్వాత ఉప ఎన్నిక‌ల్లో భూమా కుమార్తె అఖిల‌ప్రియ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత భూమా కుటుంబం టీడీపీకి ద‌గ్గ‌ర‌య్యింది.

అయితే గంగుల కుటుంబంతో వైరం… శిల్ప సోద‌రుల‌తో అభిప్రాయ బేధాలు ఇవ‌న్నీ భూమాను కొంత టెన్ష‌న్ పెట్టాయి. ఈ మ‌ధ్య కాలంలో శిల్ప సోద‌రుల‌తో ఆయ‌న రాజీ కుదుర్చుకున్నారు. ఇటీవ‌లే శిల్ప కుటుంబంలో వివాహానికి హాజ‌రై అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. త్వ‌ర‌లోనే భూమాకు మంత్రిప‌ద‌వి రానుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌లోనే ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీ గెలుపుకోసం బాగా శ్ర‌మిస్తున్నారు. దీని వ‌ల్లే ఆయ‌న కొంత ఒత్తిడికి లోన‌య్యార‌ని స‌మాచారం. ఎన్నిక‌ల హ‌డావుడిలో ప‌డి..త‌న ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేసిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి.

భూమాకు ఇంత‌కుముందే బైపాస్ అయ్యింది. అయితే త‌న స‌తీమ‌ణి శోభ మృతి త‌ర్వాత ఆయ‌న త‌న ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేశార‌ట. టీడీపీలోకి వ‌చ్చిన తర్వాత ఆయ‌న పొలిటిక‌ల్ గా బాగా యాక్టివ్ అయ్యారు. ఆ క్ర‌మంలో తిరిగి జిల్లాపై ప‌ట్టు సాధించే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. కానీ ఇంత‌లోపే ఘోరం జ‌రిగిపోయింది. గుండెపోటు రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. ఒక ప్ర‌జాక‌ర్ష‌క నేత‌ను అంద‌రికీ దూరం చేసింది. ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా .. ఆయ‌న బ‌ల‌మైన రాజ‌కీయ నాయ‌కుడు. రాయ‌ల‌సీమ గ‌డ్డ‌పై ఉన్న అతి త‌క్కువ మంది బ‌ల‌మైన నాయకుల్లో ఒక‌రాయ‌న‌. అలాంటి రాజ‌కీయ పోరాట యోధుడు ఇక సెల‌వంటూ వెళ్లిపోవ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది.!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here