భారీ సినిమాలు ఫట్ ..చిన్న సినిమాలు హిట్

0
464

  big movies plaaf small movies hit tollywood industryపెద్ద సినిమాలకు కాలం కలిసిరావడంలేదు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు అంతే స్పీడుగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఆగడు సినిమాలో మహేష్‌బాబుతో డైలాగ్ రైటర్ ఓ మాట అనిపిస్తాడు. కంటెంట్ వీక్‌గా ఉంటే పబ్లిసిటీ పీక్‌లో ఉంటుందని…ఆ మాటను అక్షరసత్యం చేస్తూ ఇటీవల విడుదలైన బడా హీరోల సినిమాలన్నీ వీక్ కంటెంట్‌తో వస్తున్నాయి. పబ్లిసిటీ మాత్రం ఎవరెస్ట్ రేంజ్‌లో చేసేస్తూ ప్రేక్షకులను, అభిమానులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇంత పబ్లిసిటీ చేస్తున్నారు కాబట్టి ఏదో విషయం ఉందని చాలా మంది బ్లాక్‌లో టిక్కెట్లు కొని…లేదా ప్రీమియర్ షోలకు టిక్కెట్లు వెయ్యి నుంచి రెండు వేలదాకా ఖర్చుపెట్టి నిరాశతో వెనుదిరుగుతున్నారు. మహేష్ మూవీ ఆగడు దెబ్బకు ఇండస్ట్రీ షేక్ అయిపోగా అప్పడే విడుదలైన లౌక్యం, అంతకుముందువారం విడుదలైన పవర్ సినిమాలు మళ్లీ కలెక్షన్ల ఊపందుకున్నాయి. బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.

అలాగే ఈ సమ్మర్ బ్లాక్‌బస్టర్ అవుతుందనుకున్న పవర్‌స్టార్ మూవీ సర్దార్ గబ్బర్‌సింగ్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టేసరికి…ఆ తర్వాత విడుదలైన సాయిధరమ్ తేజ్ సుప్రీమ్ మూవీకి ప్రేక్షకులు జైకొట్టారు.ప్రిన్స్ మహేష్‌బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాకు కూడా అంచనాలు భారీ రేంజ్‌లో ఉండటంతో ఆ మూవీకి బయ్యర్లు ఫ్యాన్సీ రేటు పెట్టి కొన్నారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక సగం కూడా రికవరీ కాలేక బొక్కబోర్లా పడింది. అదే సమయంలో ధైర్యంగా రిలీజ్ చేసిన బిక్షగాడు సినిమా కేవలం మౌత్ పబ్లిసిటీతో దాదాపు 25 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టగలిగింది. భిక్షగాడు సినిమా నిర్మాణానికి సైతం కోటిరూపాయలు ఖర్చు అయి ఉండదు. తెలిసిన తెలుగు యాక్టర్లు కూడా ఎవరూ లేరు.

అయినా కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులు భారీ చిత్రమా, స్ట్రయిట్ చిత్రమా అని ఆలోచించలేదు. ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తక్కువ బడ్జెట్‌తో ఆ ఆ మూవీని పక్కా ప్లాన్‌తో రిలీజ్ చేశాడు. ఆ సినిమాకూ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇదంతా బ్రహ్మోత్సవం తాలూకు హ్యాంగోవర్ ప్రభావమే. ఇక ఈ రెండు చిత్రాల మాట అటుంచితే… లేటెస్టుగా జనాలు కబాలి కొట్టిన దెబ్బకు విలవిలలాడిపోయి ఉన్నారు.

విడుదలకు ముందు ఆ సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మన స్టార్ల సినిమాలకు కూడా లేనంతగా తెలుగు రాష్ట్రాల్లో హైప్ వచ్చింది ఈ సినిమాకు. తొలి మూడు రోజులదాకా అడ్వాన్స్ బుక్కింగ్స్ ఫుల్ అయిపోయాయి. కబాలి ప్రమోషన్స్ మామూలు రేంజ్‌లో లేవు. విమానాల మీద, సిమ్ కార్డుల మీద, వెండి నాణాల మీదా కబాలీ ప్రచారం మార్మోగిపోయింది. అత్యధిక థియేటర్లు, సెంటర్లు ఇచ్చేసి వసూళ్లను వారంలోనే పిండేద్దామనుకున్నారు నిర్మాతలు. కానీ ఆ హైప్ అంతా విడుదలయ్యాక ఉఫ్ అని ఎగిరిపోయింది. మాంచి ఎంటర్టైన్ అవుతుందనుకున్న కబాలి తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఆ సినిమా కొట్టిన దెబ్బకు ఇప్పుడు పెళ్లిచూపులు మందు రాస్తోంది. ఈ సినిమా అంచనాల్ని మించి ఆడుతుండటానికి జనాల్లో ఉన్న కబాలి ఫ్రస్టేషన్ కూడా ఓ కారణం. ఆ దెబ్బ నుంచి పెళ్లిచూపులు ఉపశమనాన్ని ఇస్తోంది.

తొలి వారాంతం అంతా అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోవడం వల్ల భారీగా కలెక్షన్లు సాధించిన కబాలి వీకెండ్ అవ్వగానే డల్లయిపోయింది. రెండో వారంలో ఈ సినిమా వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. అదే సమయంలో పెళ్లిచూపులు హౌస్ ఫుల్స్‌తో నడుస్తోంది. విడుదలైన తొలి ఆటనుంచే పాజిటివ్ టాక్‌ను సొంతంచేసుకుంది. మొత్తానికి ఇలా భారీ ఫ్లాప్ చిత్రాలు రావడం…ఆ వెంటనే కొద్దోగొప్పో కంటెంట్ ఉన్న సినిమాలు రావడం యాదృచ్ఛికమే అయినా…లో బడ్జెట్ సినిమాలకు మాత్రం ఇది బాగా కలిసొస్తోందని చెప్పవచ్చు

Leave a Reply