అక్కడ స్టిక్కర్.. జైలుకు రూట్

carఇకనుంచి వాహనాల నంబర్ ప్లేట్లపై ప్రెస్, పోలీస్, జడ్జి, ఆర్మీ, హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్ ఫోర్స్ తదితర స్టిక్కర్లు కనిపిస్తే జైలుకు వెళ్లక తప్పదు. ఆయా స్టిక్కర్లను నెంబర్ ప్లేట్లపై అతికిస్తూ నంబర్ ప్లేట్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుండడంపై దృష్టి సారించిన ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపించాలని నిర్ణయించారు. 

పోలీస్, ప్రెస్, యాంటీ కరెప్షన్ ఫోర్స్ స్టిక్కర్లు అతికించుకుని పార్కింగ్ ఫీజులు ఎగవేస్తుండడం, కొన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులను బెదిరిస్తుండడంతో పోలీసు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే చలాన్ల నుంచి కూడా తప్పించుకుంటున్నారు. వాహనాలపై ఆయా స్టిక్కర్లు అతికించుకుని దానిని దుర్వినియోగం చేస్తే కేసులు నమోదు చేయవచ్చని హైదరాబాద్ సిటీ క్రిమినల్ కోర్టుల అడ్వకేట్ ఎస్.ప్రదీప్ కుమార్ తెలిపారు. పోలీసులు, రిపోర్టర్లు, జడ్జిలు కానివారు కూడా ఇటువంటి స్టిక్కర్లను అతికించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అటువంటి వారు పట్టుబడితే దుర్వినియోగం కింద కేసు నమోదు చేయవచ్చని వివరించారు.

2001లో పార్లమెంటుపై దాడి జరిగిన సమయంలో ఉగ్రవాదులు తమ వాహనాలకు ‘ప్రెస్’ స్టిక్కర్లు అతికించుకున్న విషయం తెలిసిందే. దీంతో స్టిక్కర్ల ద్వారా భద్రతకు కూడా ముప్పు పొంచి ఉందని భావిస్తున్న అధికారులు ఈ విషయంపై సీరియస్‌గా దృష్టి సారించారు. తాను చాలాసార్లు ఈ విషయమై ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశానని సీజే కరిరా అనే వ్యక్తి పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నంబర్ ప్లేట్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్డ్ నంబర్ ప్లేటుపై ఏదైనా రాయడం, స్టిక్కర్లు అతికించడం నేరం.

SHARE