కమలం పిలుస్తున్నా పలికేవారేరి?

 

  bjp aakarsh politician not coming bjp partyకమలనాధులు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ నీరుగారిపోయింది. ఏ పార్టీలోనూ లేనట్లు ఇతర పార్టీల్లోని నేతలను ఆకర్షించటానికి భారతీయ జనతా పార్టీ ఏకంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు అధికారికంగా ఒక కమిటీనే ఏర్పాటు చేసింది. రెండు మాసాల క్రితం కమిటీ ఏర్పడినప్పటికీ ఇప్పటి వరకూ ఒక్క నేత కూడా ఇతర పార్టీల నుండి కమలం వైపు కన్నెత్తికూడా చూడలేదు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకుంటోంది. అందుకు తగ్గట్లే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. పార్టీకి రాష్ట్రంలో సొంతబలం లేదుకాబట్టి ఇతర పార్టీల నుండి నేతలను ఆకర్షించాలని అనుకున్నది. దానికి తగ్గట్లే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కూడా ఆ మధ్య ఇతర పార్టీల నుండి నేతలను ఆకర్షించమని రాష్ట్ర నేతలను ఆదేశించారు.

ఇందులో ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఆమధ్య సీనియర్ నేతలందరూ కలిసి సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను ఆకర్షించేందుకు ఏకంగా ఆరుగురితో ఒక కమిటి వేయాలని నిర్ణయం కూడా అయింది. కమిటీలో సీనియర్ నేత, ఎంఎల్‌సి సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, రాంభూపాల్ రెడ్డి, శాంతారెడ్డి ఉన్నారు. జిల్లాల వారీగా, పార్టీల వారీగా ఇతర పార్టీల్లో అసంతృప్త నేతలను గుర్తించటం, వారితో నేరుగా గానీ లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించాలని కూడా కమిటీ అనుకున్నది. ఆ మేరకు కొంత కసరత్తు కూడా మొదలుపెట్టింది. అయితే, వారి కసరత్తులో ఆపరేషన్ ఆకర్ష్‌కు ఒక నేత కూడా దొరకలేదని సమాచారం. రాష్ట్రంలో ప్రధానంగా రెండే పార్టీలున్నాయి. ఒకటి అధికార తెలుగుదేశంపార్టీ, రెండోది ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ.

ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలుపెట్టిన టిడిపి వైసీపీలోని సుమారు 20 మంది ఎంఎల్ఏ, ఎంఎల్‌సీలను లాగేసుకున్నది. ఇంకా ఆకర్ష్‌ను ఉధృతం చేయాలని అనుకుంటున్నది. టిడిపికి మిత్రపక్షమైన భాజపా కూడా అదే ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలుపెడితే ఏ పార్టీ నుండి నేతలు భాజపాలోకి వస్తారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇదే విషయాన్ని కొందరు సీనియర్ నేతలు సమావేశంలో ప్రస్తావించినా అమిత్ షా ఆదేశాలు కాబట్టి ఎవరికి వారు మౌనాన్నే ఆశ్రయించారు. వైసీపీ పట్ల అసంతృప్తితో ఉన్న ఎంఎల్ఏలు, ఎంపిలుంటే వారు టిడిపిలోకి వెళ్ళటానికే మొగ్గు చూపుతారని… సూచించారు. ఎందుకంటే, గడచిన రెండేళ్ళుగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చేసిన సాయం ఏమీ ప్రజలకు కనబడటం లేదు. పైగా, విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజి, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్, ఆర్ధికలోటు భర్తీ తదితరాల విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తోంది.ఇక మిగిలింది కాంగ్రెస్ మాత్రమే.

కాంగ్రెస్ తరపున ప్రజా ప్రతినిధులెవరూ లేరు కాబట్టి పార్టీ నుండి బయటకు వస్తే గిస్తే నేతలుమాత్రమే రావాలి. రాష్ట్ర విభజన సమయంలో గానీ ఆ తర్వాత గానీ టిడిపిలో చేరటానికి ఇష్టపడని కాంగ్రెస్ నేతలు పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ లాంటి నేతలు భాజపాలో చేరారు.మరో వైపు రెండేళ్ళలో భాజపా కూడా ప్రజా వ్యతరేకతనే మూటగట్టుకుంటోంది. ఈ నేపధ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఉంటే కాంగ్రెస్‌లోనే ఉండి వచ్చే ఎన్నికల వరకూ పోరాటాలు చేసి మళ్ళీ ప్రజాధరణ పొందాలని అనుకుంటున్నారు. కాగా మరికొందరేమో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఎటుతిరిగీ జగన్‌కు కూడా కొన్ని నియోజకవర్గాల్లో కొందరు గట్టి నేతలు అవసరమే. రోజురోజుకూ మారుతున్న రాజకీయ సమీకరణల్లో బీజేపీ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ నేతలకు నిరాసనే మిగిల్చింది. 

SHARE