రేవంత్ కు బీజేపీ సీఎం ఆఫర్..

Posted April 17, 2017

bjp chief minister offer to revanth reddy in telanganaఓవైపు ఏపీలో టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ.. తెలంగాణలో మాత్రం అదే పార్టీకి బలహీనపరిచే ప్లాన్ చేస్తోంది. రేవంత్ రెడ్డి పార్టీ మారితే సీఎం చేస్తామన్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లోథ్ కామెంట్లు.. హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో కాంగ్రెస్ నుంచి కూడా రేవంత్ కు ఇలాంటి ఆఫరే వచ్చిందని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏకంగా డైనమిక్ ఎమ్మెల్యేగా పేరున్న రాజా సింగ్ ఈ ప్రతిపాదన చేయడంతో.. దీని వెనుక బీజేపీ అధిష్ఠానం, ఆరెస్సెస్ హస్తముందేమోనని టీడీపీ శ్రేణులు కూడా అనుమానిస్తున్నాయి.

ఏ పార్టీకి చెందిన నాయకత్వాన్నైనా ఆకర్షించడమే ఆరెస్సెస్ లక్ష్యం. అదే వ్యూహంతో రేవంత్ ను ఆకర్షిస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ కు సీఎం అయ్యే సత్తా ఉందని రాజా సింగ్ మీడియాతో కామెంట్ చేశారు. తన నియోజకవర్గ సమస్యలపై ఆవేదన వ్యక్తం చేసిన రాజాసింగ్.. కేసీఆర్ ను రేవంత్ బాగా నిలదీస్తున్నారని ప్రశంసల జల్లు కురిపించారు. తాను ఫోన్ చేస్తే కనీసం సీఎం కేసీఆర్ లిఫ్ట్ కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాజా సింగ్.

అయితే అటు రేవంత్ మాత్రం పార్టీ మార్పు వ్యవహారంపై ఆచితూచి స్పందిస్తున్నారు. తనకెలాంటి ఆఫర్లు రాలేదని, టీడీపీని వీడి వెళ్లనని కుండబద్దలు కొట్టారు. ఇంత కష్టపడింది ఇతర పార్టీల్లో చేరడానికి కాదని, టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యమంటున్నారు రేవంత్. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న తనను ఏదో రకంగా బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రేవంత్ అనుమానం వ్యక్తం చేశారు. తనకు, టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి సంబంధాలున్నాయని, ఆయన బాగా చూసుకుంటున్నారని చెప్పారు రేవంత్.

SHARE