మాస్ లీడర్లు లేక టీబీజేపీ ఢీలా!!

Posted February 4, 2017

bjp does not have mass following political leader
తెలంగాణలో బీజేపీకి చెప్పుకోతగ్గ ఓటు బ్యాంకే ఉంది. దానికి తోడు ఢిల్లీలో పార్టీ అధికారంలో ఉంది. అయినా టీబీజేపీలో ఆ సందడే ఉండదు. ఎప్పుడూ మొద్రనిద్రలో ఉన్నట్టు కనిపిస్తుంది. టీబీజేపీలో ఆ జోష్ లేకపోవడానికి పార్టీలో సరైన మాస్ లీడర్లు లేకపోవడమే కారణమని టాక్.

టీబీజేపీలో లీడర్లకు కొదవేం లేదు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, బద్దం బాల్ రెడ్డి.. చెప్పుతూ పోతే లిస్ట్ పెద్దదే. కానీ జనంలో మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు ఒక్కరంటే ఒకరు లేరు. దత్తన్న, కిషన్ రెడ్డి తప్ప అంతో ఇంతో జనంలో ఫాలోయింగ్ ఉన్న నాయకులు దాదాపుగా లేరనే చెప్పవచ్చు. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి.. క్లాస్ లీడర్లు తప్ప… మాస్ ను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయలేరు. జనంలో హడావిడి చేసే నైజం కాదు. ఆ ఎఫెక్ట్ వల్లే బీజేపీ జెండాలు కనీసం హైదరాబాద్ లోనైనా కనిపించవు. ఎప్పుడో ఒక‌సారి జెండాలు, ఫ్లెక్సీలు క‌నిపించినా.. అవి ఒక్క‌రోజుకే ప‌రిమిత‌మ‌వుతాయి.

టీఆర్ఎస్ కు హరీశ్ రావు, టీడీపీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కు కోమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, దానం నాగేందర్, ఎంఐఎంకు ఓవైసీ బ్రదర్స్ లాగా.. ధాటైన వాగ్ధాటి ఉన్న నాయకుడు టీబీజేపీకి లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. అందుకే కేంద్రం చేసే మంచి పనులు జనంలోకి వెళ్లడం లేదు. ఫలితంగా బీజేపీ ఓటు బ్యాంకు పెరగడం లేదన్న వాదన వినిపిస్తోంది.

ఢిల్లీలో చక్రం తిప్పగలిగే సామర్థ్యం ఉండి కూడా టీబీజేపీకి జీవం రాకపోవడానికి ఇదే కారణమంటున్నారు బీజేపీ క్యాడర్. కష్టపడే క్యాడర్ ఉన్నా… వారికి దిశానిర్దేశం చేసి భరోసా ఇచ్చే సరైన లీడరే లేడని వాపోతున్నారు. అగ్రనేతలు పదవులు నిర్వహించడం తప్ప… పార్టీకి ఏమాత్రం ఉపయోగపడడం లేదని ఆవేదన చెందుతున్నారు. మరి ఆ మాస్ లీడర్ ఎప్పుడొస్తాడో..? ఎప్పుడు క్యాడర్ కు భరోసా ఇస్తాడో… చెప్పడం కష్టమే!!!

SHARE