Posted [relativedate]
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు మా రూటే సపరేటు అంటూ సినిమా డైలాగులు చెబుతున్నారు. ఉన్నదే ఐదుగురు ఎమ్మెల్యేలు. ఆ ఐదుగురు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ , ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, చింతల రామచంద్రారెడ్డి. ఈ ఫైవ్ మెంబర్స్ ఎప్పుడూ కలిసి కట్టుగా కనిపించారు. ఎవరి దారి వారిదే అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. దీని వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్నా తెలంగాణలో బీజేపీ ఏమాత్రం బలపడడం లేదన్న విమర్శలున్నాయి.
ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిది ఒక్కో తీరు.రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కిషన్ రెడ్డి… పదవి నుంచి దిగిపోయాక తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఇక లక్ష్మణ్ పార్టీ చీఫ్ గా అయిన తర్వాత ఫుల్ బిజీ అయిపోయారు. మిగతా ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నా… అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టడంలో ఆయన విఫలమవుతున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ దగ్గర మంచి విషయ పరిజ్ఞానం ఉన్నా ఆయనకు ఎప్పుడో గానీ మాట్లాడే అవకాశం రాదు. అసెంబ్లీలో ఎప్పుడో తప్పిస్తే ఆయన మాట్లాడరు. ఇక రాజాసింగ్.. ఆయనకు కిషన్ రెడ్డి అంటే అస్సలు పడదు. ఆ మధ్య విమర్శనాస్త్రాలు కూడా సంధించి వార్తలకెక్కారు. ఇక మిగిలింది చింతల రామచంద్రారెడ్డి. ఈయన కిషన్ రెడ్డికి వ్యతిరేకవర్గమని చెబుతున్నారు. అసెంబ్లీలో మొత్తం చింతలదే నడుస్తుందట. ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని ఎంతసేపూ చింతలనే తీసుకుంటారట. కిషన్ రెడ్డికి అవకాశమిస్తే…ఎక్కడ ఆయనకు ఫోకస్ వస్తుందోనని ఆయన భయమని చెబుతుంటారు.
ఢిల్లీలో అధికారం ఉన్న పార్టీ అంటే ఏ రేంజ్ లో ఉండాలి. కానీ తెలంగాణ గల్లీలో మాత్రం బీజేపీ ఇబ్బందులు పడుతోంది. ఇదంతా ఎమ్మెల్యేల అంతర్గత కలహాల వల్లే జరుగుతోందన్న విమర్శలున్నాయి. అటు పార్టీకి ఒకరిద్దరు ఎమ్మెల్యేలున్న రేవంత్ రెడ్డి దూకుడుగా ఉంటే… జాతీయపార్టీ అయిన బీజేపీ సైలెంట్ గా ఉండడమేంటని పార్టీ క్యాడర్ ప్రశ్నిస్తోంది. అయితే దీని వెనక మతలబేంటో.. ఆ ఎమ్మెల్యేలకే తెలియాలి మరి….