యూపీలో బీజేపీ మూడు ముక్క‌లాట‌!!!

Posted March 19, 2017

Bjp war in utterpradesh
ఉత్త‌ర ప్ర‌దేశ్ లో బ్ర‌హ్మాండ‌మైన విజ‌యాన్ని సాధించిన బీజేపీ… ముఖ్య‌మంత్రి ప‌ద‌వి విష‌యంలోనూ ప‌క్కా స్ట్రాట‌జీతో వ్య‌వ‌హ‌రించింది. అంద‌రూ అనుకున్న‌ట్టు వివాదరహితుడైన నేత‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసింది. ఎవ‌రేమ‌నుకున్నా… మిష‌న్-2019 లో భాగంగా బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తికి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇచ్చి త‌న ఆలోచ‌న‌ను చెప్ప‌క‌నే చెప్పింది.

ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా అవ‌కాశం ద‌క్కించుకున్న యోగి ఆదిత్య‌నాథ్ ప్రొఫెల్ అంతా వివాదాస్ప‌ద‌మే. ఆయ‌న గోర‌ఖ్ పూర్ నుంచి వ‌రుస‌గా 5 సార్లు ఎంపీగా గెలిచిన‌ప్ప‌టికీ వివాదాల‌కు కేంద్ర‌బిందువుగా ఉన్నారు. విద్వేష పూరిత ప్ర‌సంగాలు, ఘ‌ర్ వాప‌సీ లాంటి కార్య‌క్ర‌మాల‌తో విమర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయ‌కంటూ యూపీలో చ‌రిష్మా ఉంది. ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే శ‌క్తి ఉంది. ముఖ్యంగా యూపీలో బీజేపీకి ఓట్ల సునామీ రావ‌డంలో ఆయ‌న పాత్ర త‌క్కువేం కాదు. అంతేకాకుండా బ‌ల‌మైన రాజ్ పుత్ వ‌ర్గానికి ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇవ‌న్నీ ఆయ‌న‌కు క‌లిసివ‌చ్చాయి. ఆదిత్య‌నాథ్ కు ఇవ్వ‌డం ద్వారా ఆ సామాజికవ‌ర్గం దృష్టిని ఆక‌ర్షించింది బీజేపీ హైక‌మాండ్.

సీఎంతో పాటు ఇద్ద‌రు డిప్యూటీ సీఎంల‌ను కూడా నియ‌మించి ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు న్యాయం చేసే ప్ర‌య‌త్నం చేశారు బీజేపీ పెద్లలు. యూపీలో ఓబీసీలు పెద్ద మొత్తంలోనే ఉన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓబీసీలు బీజేపీకి అండ‌గా నిలిచారు. కాబ‌ట్టి ఆ వ‌ర్గానికి చెందిన కేశవ్ ప్ర‌సాద్ మౌర్య‌కు డిప్యూటీ సీఎంగా అవ‌కాశం ఇచ్చారు. మ‌రో డిప్యూటీ సీఎంగా దినేశ్ శ‌ర్మ‌కు ఇవ్వ‌డం వెన‌క పెద్ద స్కెచ్చే ఉంది. యూపీలో బ్రాహ్మ‌ణులు కూడా కీల‌కంగా ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి రావాల‌న్నా బ్రాహ్మ‌ణుల మ‌ద్ద‌తు త‌ప్ప‌నిస‌రి. ఆ వ‌ర్గానికి చెందిన దినేశ్ శ‌ర్మ‌కు ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా ఇప్ప‌ట్నుంచే 2019కి లైన్ క్లియ‌ర్ చేసుకుంది బీజేపీ.

ఇలా రాజ్ పుత్, ఓబీసీ, బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాల‌కు పెద్ద పీట వేయ‌డం ద్వారా బీజేపీ ఆలోచ‌నేంటో బ‌య‌ట‌ప‌డింది. ఎలాగూ ద‌ళితులు బీఎస్పీకి మ‌ద్దతుగా నిలుస్తారు. బీసీలు, ముస్లింలు ఎస్పీ వెంట ఉన్నారు. కాబ‌ట్టి మిగిలిన ఓబీసీలు, అగ్ర‌కులాలు, బ్రాహ్మ‌ణులను త‌న వైపుకు తిప్పుకునేందుకు మూడు ముక్క‌లాట ఆడారు బీజేపీ పెద్ద‌లు. మిష‌న్ 2019కు ఇప్ప‌ట్నుంచే పెద్ద స్కెచ్ వేశారు. ఈ మూడుముక్క‌లాటతో ఒకేసారి బ‌ల‌మైన ఓటుబ్యాంకుకు పునాదులు వేసుకున్నారు. ఎంత‌యినా మోడీ-అమిత్ షా రాజ‌కీయ చ‌తుర‌త‌ను మెచ్చుకోవాల్సిందే. లేక‌పోతే దేశంలోనే పెద్ద‌రాష్ట్ర‌మైన యూపీలో ఇంత భారీ విజ‌యం ద‌క్క‌డ‌మంటే మాట‌లు కాదు!!

SHARE