నిర్ణయం తీసుకోకపోతే చచ్చిపోతాం..!!

Posted March 21, 2017

Boiling Frog inspirational story for human beingజీవిత స‌త్యాన్ని చెప్పే క‌ప్ప క‌థ‌.!

ఒక కప్పను తీసుకొని “వేడి నీటిలో” పడేస్తే, అది వెంటనే బయటకి దూకేస్తుంది!

అదే కప్పను చల్లని నీటి గిన్నెలో వేయండి. అది అక్కడే ఉంటుంది.

ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేయండి. కప్ప సహజగుణం ఏంటి అంటే. వేడి పెరిగే కొద్దీ దానంతట అదే తన శరీరాన్ని ఆ వేడికి అడ్జస్ట్ చేసుకోగలదు. కానీ ఒకసారి నీరు మరగడం మొదలైతే “కప్ప” అందులో ఉండలేదు. బయటకి దూకేయాలని చూస్తుంది. కానీ అప్పుడు అది దూకలేదు. ఎందుకంటే నీటి వేడికి అప్పటిదాకా అడ్జస్ట్ అవ్వడంతో తన శక్తి అంతా కోల్పోతుంది.

ఇక బయటకి దూకే శక్తి లేక అందులోనే ఉండిపోయి చివరికి మరణిస్తుంది. 

ఇది కేవలం కథ కాదు. ఇందులో చాలా నీతి ఉంది!

ఇప్పుడు ఒకటి ఆలోచించండి! కప్ప ఎలా చనిపోయింది? — చాలా మంది వేడి నీటి వల్ల అంటారు!

కానీ నిజానికి వేడి నీటి వల్ల కప్ప చనిపోలేదు. నీటిలో నుండి బయటకి ఎప్పుడు దూకేయాలో నిర్ణయించుకోలేక చనిపోయింది.

కొద్దిగానే వేడి పెరిగింది కదా , సర్దుకుపోదాంలే అనుకుంటూ వేడి నీటిలోనే ఉండి పోయింది. చివరికి నీరు మరిగే సరికి అది బయటకి దూకలేకపోయింది!

అలాగే మనం కూడా జీవితంలో అడ్జస్ట్ అవ్వాలి. కానీ అడ్జస్ట్ అవుతూనే ఉండి జీవితంలో పైకి ఎదగకుండా అక్కడే ఉండిపోవద్దు. ఎదుటి వాడికి మనల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా హింసించే అవకాశం ఇచ్చాము అనుకోండి. వాడు హింసిస్తూనే ఉంటాడు. మనం మొదట్లో భరించగలము. కానీ చివరికి వచ్చేసరికి భరించలేము. అందుకే

మనకి శక్తి ఉన్నప్పుడే సమస్యనుండి బయటకి వచ్చేయాలి. పర్లేదులే అనుకుంటూ భరిస్తూ ఉంటే, చివరికి సమస్యల వలలో చిక్కుకొని మరణించాల్సి వస్తుంది!.

 జీవితంలో ఎలాంటి పరిస్థితిలో అయినా తగిన సమయంలో నిర్ణయం తీసుకోడం చాలా ముఖ్యం.

SHARE