Posted [relativedate]
వైసీపీ అధినేత జగన్ పై బొత్స సత్యనారాయణ అలిగారా? వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా? ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం వల్లే ఇదంతా జరుగుతోందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది.
బొత్స సత్యనారాయణ సమైక్యరాష్ట్రంలో ఒక వెలుగు వెలిగారు. పీసీసీ చీఫ్ గా, మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన దెబ్బతో ఆయన ఓడిపోవాల్సి వచ్చింది. కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఆయన చివరకు వైసీపీలోకి వచ్చేశారు. జగన్ పార్టీలోనూ ఆయనకు మంచి ప్రాధాన్యం లభించింది. ముఖ్యంగా వైసీపీ తరపున మంచి వాయిస్ వినిపించారాయన. అధికార పక్షానికి కౌంటర్ ఇవ్వాలంటే జగన్.. మొదట బొత్సనే ఎంచుకునేవారు. వైసీపీ ప్రతి ప్రెస్ మీట్ లోనే ఆయనే మెయిన్ అట్రాక్షన్. అలాంటిది కొంతకాలంగా బొత్స ప్రెస్ మీట్ లలో కనిపించడం లేదు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారో వైసీపీ నాయకులకు అర్థం కావడం లేదు. ఆ మధ్య విజయవాడ బస్సు ప్రమాదం జరిగినప్పుడు జగన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సమయంలోనూ బొత్స వచ్చి… జగన్ కు బాసటగా నిలుస్తారని భావించినా అలా జరగలేదు.
ఇదంతా చూస్తుంటే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. జగన్ పై బొత్స తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ నాయకులు ఇప్పటికే ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. ఆయన నుంచి స్పందన లేదని సమాచారం. జగన్ స్వయంగా బొత్సకు ఫోన్ చేసినా ఆయన అందుబాటులోకి రావడం లేదట.
బొత్స అసంతృప్తి వెనుక ఎమ్మెల్సీ ఎన్నికలే కారణమని టాక్. వైసీపీ తరపున ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని .. జగన్ పై ఆశలు పెట్టుకున్నారట ఆయన. కానీ జగన్ మాత్రం బొత్సకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఎమ్మెల్యేల కోటాలో గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్లనానిని ఎంపిక చేశారు. దీంతో బొత్స ఇక జగన్ కు కటీఫ్ చెప్పబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి… వేరే పార్టీలో చేరనున్నారని బలంగా ప్రచారం జరుగుతోంది. బొత్స సత్యనారాయణ స్వయంగా వివరణ ఇచ్చే వరకు ఈ ఊహాగానాలు ఇలా చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అప్పుడు గానీ ఈ విషయంపై క్లారిటీ రాదు!!!