Posted [relativedate]
భూమా నాగిరెడ్డి మరణంతో ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే సానుభూతి పవనాలు బలంగా వీస్తున్న తరుణంలోనూ … నంద్యాలలో పోటీ చేయాలని వైసీపీ నిర్ణయించింది. స్వయంగా జగనే ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో ఆ పార్టీ క్యాడర్ పరేషాన్ అవుతున్నారు.
వైసీపీ ఆరంభం నుంచి భూమా ఆ పార్టీలో ఉన్నారు. టీడీపీకి దీటుగా బదులిస్తూ.. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచారు. ఒకదశలో పోలీసు కేసులను కూడా ఎదుర్కొన్నారు. అలాంటి భూమా చివరకు టీడీపీలోకి వెళ్లిపోయారు. అయినా క్యాడర్ కొంతమంది పార్టీ మారడం ఇష్టంలేక వైసీపీలోనే ఉండిపోయారు. ఇప్పుడు భూమా మరణంతో ఉప ఎన్నికలు రావడం.. అందులో వైసీపీ పోటీకి సిద్ధమవ్వడం ఆ పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేపోతున్నారు. నిన్న మొన్నటిదాకా వెన్నంటి నిలిచిన భూమా కుటుంబానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ ఎలా చేయాలన్నది వారి ప్రశ్న.
నంద్యాలలో భూమా కుటుంబానికి ప్రస్తుతం గట్టిపట్టుంది. అందులోనూ భూమాకు పార్టీలకతీతంగా అభిమానులున్నారు. భూమా మరణించారు.. కాబట్టి ఇతర పార్టీల నాయకులు కూడా ఆ సానుభూతికి ఆ కుటుంబానికి సహకరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆమాట కొస్తే వైసీపీ మినహా ఇక ఏ ఇతర పార్టీ కూడా ఇక్కడ్నుంచి పోటీ అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి వైసీపీ పోటీ చేసినా పెద్దగా ఒనగూరేదేమీ లేదంటున్నారు వైసీపీ క్యాడర్. అసలు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగాలన్నది వారు ప్రశ్నిస్తున్నారు. భూమా నాగిరెడ్డి లాంటి దిగ్గజ నాయకుడి కుటుంబానికి వ్యతిరేకంగా ఉప ఎన్నికలో వైసీపీ పోటీ చేయడం అవసరమా అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఎలాగూ వైసీపీకి ఓట్లు పెద్దగా పడవు… కాబట్టి భూమా కుటుంబం గెలుపు లాంఛనమేనని వారు చెబుతున్నారు. అంతేకాదు ఉప ఎన్నికలో పోటీ చేయడం ద్వారా ఉన్న కొంతమంది కూడా టీడీపీవైపు వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది. బైపోల్ లో వైసీపీకి డిపాజిట్ దక్కడం కష్టమేనన్న మాట వినిపిస్తోంది.
ఏ ఎన్నికల్లో పోటీ చేయడం రాజకీయ పార్టీలకు అవసరమే. కానీ సమయం, సందర్భం కూడా చూసుకోవాలి. ఉప ఎన్నికలో పోటీ చేసి… ఒకవేళ డిపాజిట్ కూడా రాకుంటే అది పార్టీకి నష్టమే తప్ప లాభం కాదు. అందుకే ఇప్పటికైనా జగన్ నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆ పార్టీ క్యాడర్ కోరుకుంటున్నారు!!! మరి ఈ మాటను జగన్ ఆలకిస్తారా.. అన్నది అనుమానమే!!!