కృష్ణమ్మ పై నుంచి చూస్తున్న నిఘా నేత్రాలు..

0
613

  cc cameras  observation krishna pushkaraalu

కృష్ణా పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ టెక్నాలజీని ఆయుధంగా మలుచుకుంది. అందుబాటులో ఉన్న ఏ సరికొత్త ప్రపంచస్థాయి సాంకేతికతను వినియోగించుకునేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికే ఆధునిక పరిఙ్ఞన నిఘా, సమాచార వ్యవస్థను అన్వేషించి ఒడిసిపట్టుకున్న పోలీసుశాఖ పుష్కరాలను విజయవంతంగా నడిపేందుకు ప్రణాళిక ఏర్పాటు చేసుకుని అమలు చేస్తోంది.18డ్రోన్ కెమెరాలను 12రోజుల పాటు విజయవాడ పుష్కర గగన తలంలో చక్కర్లు కొట్టనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ట్రైల్న్ కూడా నిర్వహించారు.

మరోవైపు 1400 అత్యాధునిక హైడిజిట్ సిసి కెమెరాలు 24గంటలపాటు పహరా కాసేందుకు ఏర్పాట్లు జరిగాయి. ముఖ్యంగా పుష్కర కృష్ణా పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ ఎతైన స్కైబెలూన్ మల్టీకెమెరా సిస్టం కనుచూపుమేరలో దృశ్యాలను రికార్డు చేసి కమాండ్ కంట్రోల్‌కు పంపేలా అమర్చారు. భారీ స్థాయిలో బందోబస్తు, ట్రాఫిక్ యంత్రాంగాన్ని సిద్ధం చేసి బరిలో దింపినా.. వారి విధుల్లో మాత్రం సాంకేతికను చొప్పిస్తోంది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తకోటికి ఏమాత్రం అసౌకర్యం లేకుండా, ఇదే సమయంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో హాజరయ్యే వివిఐపిలు, యాత్రికుల భద్రత, రక్షణకు సంబంధించిన అంశాల్లో కూడా సాంకేతిక పరిఙ్ఞనాన్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ నిపుణులను రంగంలోకి దింపింది.

మరోవైపు నిఘాకు సంబంధించి ఇదే స్థాయిలో దృష్టి సారించిన పోలీసుశాఖ అత్యాధునిక సిసి కెమెరాలను పుష్కరాల విధుల్లో పూర్తిస్థాయిలో వినియోగిస్తోంది. దుర్గగుడి చెంత అలరారుతున్న కృష్ణమ్మ ఒడిలో భక్తులు స్నానమాచరించేందుకు రోజూ లక్షల్లో తరలివస్తారని ఇప్పటికే పోలీసుశాఖ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. బెజవాడ కమిషనరేట్ పరిధిలో 29పుష్కర స్నానఘాట్‌లను గుర్తించింది. ఒక్కో ఘాట్‌కు ఒక్కో ఐపిఎస్ అధికారి చొప్పున మొత్తం 20కి పైగా సీనియర్ ఐపిఎస్ అధికారులు ఇన్‌ఛార్జిలుగా విధుల్లో ఉన్నారు. వివిఐపిలు పాల్గొనే ఘాట్‌లకు ఐఏఎస్ అధికారులతోపాటు అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటైన బృందం పర్యవేక్షిస్తోంది.

మొత్తం 18వేల మంది అధికారులు, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తుండగా, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు అదనంగా మరో 3,300 మందిని కేటాయించారు.మొత్తం పుష్కర బందోబస్తు, భద్రత, రక్షణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, పర్యవేక్షణ, సమాచార వ్యవస్థ తదితర వాటికి సంబంధించి ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూము కీలకమైంది. దుర్గగుడి చేరువలో ఉన్న దుర్గాఘాట్‌కు విఐపిల తాకిడి ఉంటుంది. ఇక్కడే ఈ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. చుట్టూ అద్దాలతో నిర్మితమైన కమాండ్ కంట్రోల్ నుంచి ముఖ్యమంత్రి, డిజిపి, ఇతర ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణుల బృందం మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తుంది.

Leave a Reply