కేంద్రంలోనూ క్యాబినెట్ విస్తరణ

Posted April 7, 2017

ఏపీ క్యాబినెట్ విస్తరణ జరిగిన రోజుల వ్యవధిలోనే.. కేంద్ర క్యాబినెట్ విస్తరణకు కూడా ముహూర్తం సిద్ధమైంది. బడ్జెట్ సెషన్ ముగిశాక.. ఏప్రిల్ 27న క్యాబినెట్ విస్తరణ చేయాలని ప్రధాని మోడీ నిర్ణయించారు. సీనియర్ నేతలు, యువ ఎంపీలను సమన్వయం చేస్తూ ఈసారి కూర్పు ఉండనుంది. రాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శివసేనకు మరో మంత్రి పదవి దక్కనుంది. ఏపీ నుంచి టీడీపీకి కూడా మరో పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎవరికి మంత్రి పదవులివ్వాలనే విషయంపై మోడీ ఆరెస్సెస్ నుంచి అంగీకారం తీసుకున్నట్లు సమాచారం.

కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ గోవా సీఎంగా వెళ్లడంతో.. కీలకమైన రక్షణ శాఖను అదనపు బాధ్యతగా ఆర్థిక మంత్రి జైట్లీకి అప్పగించారు. కాన కీలక శాఖలు ఒకరి దగ్గరే ఉండటం భావ్యం కాదని మోడీ భావిస్తున్నారు. అందుకే జైట్లీ దగ్గర రక్షణ శాఖ మాత్రమే ఉంచుతారట. కీలకమైన ఆర్థిక శాఖను పీయూష్ గోయల్ కు అప్పగించే అవకాశం ఉంది. విద్యుత్ శాఖ మంత్రిగా మంచి పనితీరు కనబరిచిన గోయల్.. దేశంలో అన్ని గ్రామాలకు కరెంట్ ఇవ్వాలని మోడీ మిషన్ ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇక ఇటీవలే కిడ్నీమార్పిడి ఆపరేషన్ చేయించుకున్న సుష్మాస్వరాజ్ ను విదేశాంగ మంత్రిగా తప్పించి.. తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రానికి గవర్నర్ గా పంపాలని ఆరెస్సెస్ మోడీకి సూచించింది. దీనికి ఓకే చెప్పిన ప్రధాని.. రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేను విదేశాంగ మంత్రిగా తీసుకునే అవకాశం ఉంది. రాజే స్థానంలో రాజస్థాన్ సీఎంగా బీజేపీ సీనియర్ ఓం ప్రకాష్ మాధుర్ నియమితులు కానున్నారు. ఇక యూపీ సీఎం రేసులో చివరి వరకు ఉన్న మనోజ్ సిన్హాకు కూడా పెద్దశాఖే దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ నుంచి టీడీపీకి పదవి ఖాయం కావడంతో.. తనకు క్యాబినెట్ దక్కుతుందని చంద్రబాబు చెప్పినట్లు ఓ బీసీ ఎంపీ అప్పుడే ప్రచారం కూడా మొదలుపెట్టేశారు.

SHARE