పచ్చా పచ్చని మొక్కకు ప్రైవేట్ సాయం….

0
721

chandra babu vanam manam

హరితాంధ్ర ప్రదేశ్ సాధనే లక్ష్యంగా ఒకే రోజు కోటి మొక్కలు నాటాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. దానికి ముహుర్తం కూడా ఖరారు చేసింది. ఈనెల 29న రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు ‘వనం-మనం’ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలోని సుంకొల్లు గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్వయంగా శ్రీకారం చుట్టనున్నారు.వనం.. మనం కార్యక్రమంతో హరితాంధ్రప్రదేశ్ సాధించడమే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. .

జిల్లాలవారీగా మొక్కల నాటే బాధ్యతను మంత్రులు తీసుకోవాలని చెప్పారు. వనం-మనం కార్యక్రమం విజయవంతం చేసేందుకు త్వరలో ముగ్గురు సభ్యులతో కమిటీ వేయనున్నట్టు ప్రకటించారు. కోటి మొక్కల సంకల్పానికి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని, అందరినీ సంసిద్ధులు చేయాలని సీఎం ఆదేశించారు.అటవీ, పర్యావరణ శాఖ, వైల్డ్‌లైఫ్ బోర్డ్‌పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 23 శాతంగా వున్న అటవీ విస్తీర్ణాన్ని 2029 నాటికి 50 శాతానికి విస్తరించేలా చేయడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేలా అధికారులు కార్యాచరణ చేపట్టాలని, స్వచ్ఛంద సంస్థల సాయం కూడా తీసుకోవాలని సూచించారు. హరితాంధ్రప్రదేశ్ సాకారానికి అవసరమైన నిధుల సమీకరణపైనా దృష్టి పెట్టాల్సిందిగా అధికారులకు సూచించారు. రైల్వే లైన్లకు, రహదారులకు ఇరువైపులా చెట్లు పెంచాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు.

రాష్ట్రంలో ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయడం ద్వారా పచ్చదనాన్ని గణించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. మొక్కలు పెద్దసంఖ్యలో నాటే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ప్రతి ఒక్కరిని ప్రకృతికి మరలా దగ్గర చేయడమే ఆశయంగా వుండాలని చెప్పారు. ట్రీ బ్యాంక్ ఏర్పాటు వంటి వినూత్న ఆలోచనలతో పచ్చదనానికి బాటలు వేయాలని అన్నారు. చెట్ల పెంపకం కార్యక్రమం, విత్తనాల సేకరణ కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా ఏడాది పొడవునా చేపట్టాలని స్పష్టం చేశారు. 2016-17 సంవత్సరానికి 1500 మెట్రిక్ టన్నుల విత్తనాలను లక్షన్నర హెక్టార్లలో నాటేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాంతాలవారీగా మొక్కల పెంపకాన్ని డ్వాక్రా గ్రూపులకు అప్పగించడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను వారికే ఇవ్వాలని సూచించారు. జలవనరులకు సమీపంలో చెట్లను పెంచడం ద్వారా నీటి సంరక్షణ కూడా సాధ్యమవుతుందని అన్నారు.

వైల్డ్‌లైఫ్ బోర్డ్‌పై జరిగిన సమీక్షలో ఎకో టూరిజంపై ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. కొల్లేరు మంచినీటి సరస్సులో కనీస నీటిమట్టం వుండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇందుకు గోదావరి నీటిని తరలించాలని చెప్పారు. కొల్లేరు సరస్సును సంరక్షించి, పర్యాటకులను మరింత ఆకర్షించేలా కన్సల్టెంట్‌ను నియమించి కార్యాచరణ రూపొందించాలని అన్నారు. రాష్ట్రంలోని ఐదు బర్డ్ శాంక్చురీలను అభివృద్ధి చేయాలని, మడ అడవులను కాపాడాలని ముఖ్యమంత్రి చెప్పారు. టైగర్ ఫారెస్ట్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఏడాదిలోగా తిరుపతి, విశాఖ జూపార్క్ లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలను ఆహ్లాదకరంగా, ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు ప్రైవేట్ సంస్థల సాయం తీసుకోవాలని సూచించారు. 

Leave a Reply