మొన్నటికి మొన్న క్యాబినెట్ అసంతృప్తులు, చివరకు శాఖల కేటాయింపులోనూ అలకలు, ఇప్పుడు పట్టణ కమిటీలు కూడా కట్టుదాటుతున్న స్థితి. క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీ ఎటు పోతోంది. ఎందుకిలా జరుగుతుంది.. నేతలకు కాస్త చనువిస్తే చంకనెక్కుతున్నారని భావించిన చంద్రబాబు.. మరోసారి కొరడా ఝుళిపించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పై వేటు సంకేతాలిచ్చిన సీఎం.. ఇప్పుడు కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణానికి చెందిన ముగ్గుర్ని కూడా తప్పించేందుకు సిద్ధమౌతున్నారు.
పెనమలూరు నియోజకవర్గంలో ఉయ్యూరు పట్టణ, మండల అధ్యక్షుల ఎంపికకు పేర్లను స్వీకరించే క్రమంలో తెలుగు తమ్ముళ్ళ కుమ్ములాటను టీడీపీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. అధ్యక్షులను మార్చుతారన్న ఉద్దేశ్యంతో తెలుగు తమ్ముళ్ళు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగటం, వారించటానికి యత్నించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గాయపడటం తెలిసిందే. జరిగిన ఘటనకు సంబంధించి జిల్లా నాయకుల నుంచి వివరాలు సేకరించింది. దీంతో పాటు టీడీపీ కార్యక్రమాల కమిటీ కన్వీనర్ వీవీ చౌదరిని కూడా పూర్తి సమాచారాన్ని తెలుసుకునే బాధ్యతలు అప్పగించింది. ఆయన వెంటనే పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, పార్టీ పరిశీలకుడు లంకా శ్రీనివాస్‌లను గుంటూరులోని కార్యాలయానికి పిలిపించి వారి నుంచి వివరణ కోరారు.
జరిగిన ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు టీడీపీ నేతలు వల్లభనేని సత్యనారాయణ , తుమ్మల శ్రీనివాస్, కూనపురెడ్డి వాసుకు తెలుగుదేశం రాష్ట్ర పార్టీ షోకాజు నోటీసులు జారీ చేసింది. మౌఖికంగా తమ దృష్టికి తీసుకు వచ్చిన విషయాలను లిఖిత పూర్వకంగా పంపించాలని జిల్లా నాయకులను కోరింది. జరిగిన ఘటనకు సంబంధించి వారు వ్యవహరించిన తీరుపై సవివరణ ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో చర్యలు ఉంటాయని షోకాజు నోటీసులో పేర్కొన్నట్టు సమాచారం. దీంతో తెలుగు తమ్ముళ్లకు టెన్షన్ మొదలైంది. చంద్రబాబుకి కోపమొస్తే ఎలా ఉంటుందో.. తెలుసు కాబట్టి తమ్ముళ్లు వణికిపోతున్నారు.