టీడీపీ రెండు కాళ్లు చెరోవైపు?

 Posted November 2, 2016

chandrababu combines with other parties
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నోటివెంట తరచూ వినపడేది రెండు కళ్ల సిద్ధాంతం.రెండు ప్రాంతాలు తనకు రెండు కళ్లని చెబుతుండేవారు. ఆయన్ని ఓ వైపు నెట్టడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చివరిదాకా అదే మాట వినిపించారు.ఫలితంగా 2014 ఎన్నికల్లో ఆంధ్రాలో అధికారం దక్కింది ..తెలంగాణలోనూ గౌరవప్రదమైన స్థానాలు వచ్చాయి.తర్వాత కెసిఆర్ ఆకర్ష్ దెబ్బకి తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.ఇప్పుడు అక్కడ తిరిగి బలం పుంజుకునేందుకు టీడీపీ ఎంచుకున్న ఎత్తుగడ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
ఆంధ్రాలో బీజేపీ తో కలిసి నడుస్తూనే ..తెలంగాణాలో సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం చేస్తున్న యాత్ర లో కలిసి నడవటం రాజకీయంగా సంక్లిష్ట వ్యవహారమే.కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై పుట్టిన ఎర్రజెండాలు ఇప్పుడు బీజేపీ వ్యతిరేక సిద్ధాంత ప్రాతిపదికనే రాజకీయాలు చేస్తున్నాయి.అలాంటి సందర్భంలో ఇద్దరు బద్ధ శత్రువులతో ఏకకాలంలో స్నేహం చేయడం తేలిగ్గాదు. ఓవైపు ఆంధ్రాలో సిపిఎం నేతలు టీడీపీ అంటే విరుచుకుపడుతుంటే అదే జెండాకి తెలంగాణాలో మద్దతు సరైన వ్యూహం కాకపోవచ్చు.ఒకప్పుడు జాతీయపార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రాంతానికో వ్యూహాన్ని అమలు చేసి తాత్కాలిక లబ్ది పొందింది.దీర్ఘకాలికంగా దాని వల్ల జరిగే నష్టాన్ని ఇప్పుడు చవిచూస్తోంది.రెండు కళ్లు కలిసి ప్రపంచాన్ని చూడగలవేమోగానీ …రెండు కాళ్ళు చెరోవైపు నడవలేవు..రాజకీయ ఘనాపాటి బాబు …అయన శిష్యుడు రేవంత్ కి ఈ విషయం తెలీదా? అయితే టీడీపీ రెండు కాళ్ళ వ్యూహం లో ఓ కొసమెరుపుంది. తెలంగాణాలో తమని లెక్కచేయని కమలానికి ఝలక్ ఇవ్వడానికి సైకిల్ చేస్తున్న టెంపరరీ జర్నీ అనే వాదన కూడా వినిపిస్తోంది.ఏమో రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.

SHARE